హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి దందా చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.12 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు. అప్పర్ ధూల్‌పేట్‌లోని ఓ ఇంట్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్ టీమ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి గురువారం దాడులు నిర్వహించారు. 1.12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురు మహిళలతో పాటు సన్నీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని, చాలా కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్
ఘట్ కేసర్: ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న యువకుడిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నోజిగూడలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన పండ్యాల మహేశ్(19) ఏపీలోని అరకులో గంజాయి కొనుగోలు చేసి సిటీకి తెస్తున్నాడు. సరకును ప్యాకెట్లుగా చేసి పోచారం పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు అమ్ముతున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 660 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజువర్మ తెలిపారు.