మలేషియాలో నాలుగేండ్ల తెలుగు కోర్సు.. తెలుగు వర్సిటీతో ‘టామ్’ ఎంవోయూ

మలేషియాలో నాలుగేండ్ల తెలుగు కోర్సు.. తెలుగు వర్సిటీతో ‘టామ్’ ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: మలేషియాలో  నాలుగేండ్ల తెలుగు డిప్లొమా కోర్సు నిర్వహించేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీతో మలేషియా తెలుగు సంఘం (టీఏఎం-టామ్) ఎంవోయూ కుదుర్చుకున్నది. మలేషియాలోని రవాంగ్ సిటీలో గురువారం తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటప్రతాప్, ఉపాధ్యక్షుడు సత్తయ్య, సుధాకర్ నాయుడు, సురేశ్ నాయుడు,  సలహాదారులు ప్రముఖ డాక్టర్  అచ్చయ్య కుమార్  సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్టిఫికేట్ కోర్సులతో పాటు నాలుగేండ్ల డిప్లొమా కోర్సులను ప్రారంభించేందుకుగానూ ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీనిపై వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ..మలేసియాలో స్థిరపడ్డ తెలుగు భాషాభిమానులు చేసిన నితంతర కృషి ఫలితమే తెలుగు కోర్సుల ప్రారంభానికి శ్రీకారమని తెలిపారు.

తెలుగు భాష కోర్సులనే కాకుండా లలిత కళా రంగానికి చెందిన వివిధ సాంస్కృతిక కోర్సులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ..కౌలాలంపూర్  సమీపంలోని రావాంగ్ పట్టణంలో  తెలుగు అకాడమీ పేరుతో విశాల భవన సముదాయాన్ని నిర్మించినట్టు చెప్పారు. దాంట్లో ఏడాది పొడుగున జరిగే తెలుగు సంప్రదాయ పండుగలను, ఆచార వ్యవహారాలు తెలిసేలా సమ్మేళనాలను, సమావేశాలను జరుపుతున్నామని  వివరించారు. 

కొత్త తరానికి  తెలుగు భాష నేర్పడం, తెలుగువారితో సత్సంబంధాలు పెంచుకోవడం కోసం  తెలుగు వర్సిటీతో చేసుకున్న ఒప్పందం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తెలుగు కోర్సులతో మలేషియాలోని తెలుగు వలసదారులకు ఎంతో ఉపయోగమని తెలుగు మలేషియా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.