జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నాలుగేండ్ల చిన్నారి గుండెపోటుతో చనిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి రాజు, జమున దంపతులకు ఇద్దరు పిల్లలు. రాజు జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు శ్రీయాన్షి(4) మంగళవారం కండ్లు తిరుగుతున్నాయంటూ అస్వస్థతకు గురి కాగా, హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా చిన్నారి గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పుట్టిన సమయంలోనే చిన్నారికి గుండెలో హోల్ ఉందని, దానిని గుర్తించకపోవడం వల్లే గుండెపోటు వచ్చిందన్నారు. గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
బెల్లంపల్లిలో మరో చిన్నారికి జ్వరం...
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ బస్తీకి చెందిన నాలుగేండ్ల చిన్నారి జ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. బస్తీకి చెందిన ఆర్ఎంపీ బండి శ్రావణ్ కుమార్ కూతురు బండి తనిష్ఠ(4) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మొదట బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.