ఒలింపిక్స్ పతక విజేత భజరంగ్ పునియాపై నాలుగేళ్ల సస్పెన్షన్

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్సెన్షన్ వేటు వేసింది. డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో భజరంగ్ పునియాపై నాడా నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ 2024, ఏప్రిల్ 23వ తేదీ నుండి నుంచి నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుందని నాడా స్పష్టం చేసింది. కాగా, మార్చిలో జరిగిన నేషనల్ రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో డోప్ టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినందుకు 2024, ఏప్రిల్ 23న పునియాను నాడా తాత్కలికంగా సస్పెండ్ చేసింది. 

భజరంగ్ పునియా ఈ సస్పెన్షన్‎ను యాంటీ-డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)లో సవాల్ చేశారు. పునియాపై నాడా విధించిన తాత్కలిక సస్పెన్షన్‎ను ఏడీడీపీ ఉపసంహరించుకుంది. అనంతరం సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ ఇష్యూపై యాంటీ-డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ విచారణ చేసింది. ఈ సందర్భంగా బజరంగ్ పునియా డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ ధృవీకరించింది. ఆర్టికల్ 10.3.1 ప్రకారం ఆంక్షలకు భజరంగ్ బాధ్యుడని.. అతడు 4 సంవత్సరాల పాటు అనర్హతకి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏడీడీపీ ప్యానెల్ పేర్కొంది.

Also Read:-గాయత్రి జోడీకి వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్తు

కాగా, మహిళా రెజర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భజరంగ్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‎ను సస్పెండ్ చేయాలని మహిళా రెజ్లర్ వినేష్ ఫొగొట్, సాక్షి మాలిక్ తో కలిసి ఆందోళన చేశాడు. ఈ పరిణామాల అనంతరం భజరంగ్ పునియా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి.. ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలో భజరంగ్ పూనియాపై నాడా నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.