
- సంగారెడ్డి జిల్లాలో రెండు.. మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఒక్కోటి
- 20 - 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
- ఒకేచోట దాదాపు 25 వేల మందికి నాణ్యమైన విద్య
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో మొదటి విడత 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ఇండియా స్కూల్స్మంజూరయ్యాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో రెండు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి నిర్మించనున్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి .. ఒక్కో దానికి రూ.200 కోట్లు కేటాయించింది. ఒకే చోట దాదాపు 2,500 మందికి క్యాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది.
200కోట్లు సాంక్షన్
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొదటి విడతలో మెదక్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరైంది. రామాయంపేటలో ఈ స్కూలు నిర్మించాలని నిర్ణయించి భూసేకరణ పూర్తి చేశారు. గత డిసెంబర్ 25న జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఏడుపాయలలో జరిగిన కార్యక్రమంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ స్కూలుకు ప్రభుత్వం రూ. 200 కోట్లు సాంక్షన్ చేసింది.
సంగారెడ్డి జిల్లాలో రెండు స్కూల్స్
సంగారెడ్డి జిల్లాకు రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరయ్యాయి. ఒకటి అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పుల్కల్ మండలం బస్వాపూర్ లో, మరొకటి నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం వాసర లో నిర్మించనున్నారు. ఈ స్కూళ్ల నిర్మాణానికి ఈనెల 5న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమి పూజ చేశారు. బస్వాపూర్ లో 33 ఎకరాలు, వాసరలో 25 ఎకరాల భూసేకరణ చేశారు. ఒక్కో దాన్ని రూ.125 కోట్లతో నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. వాసర స్కూలు కోసం భూములిచ్చిన 15 కుటుంబాలకు ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నారాయణఖేడ్, అందోల్ సెగ్మెంట్లు వెనుకబడ్డాయి. దీంతో ఈ రెండు చోట్ల యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరు చేశారు.
అన్ని హంగులతో..
సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరైంది. కోహెడ మండలం తంగాల్లపల్లి శివారులోని 742,764 సర్వే నంబర్ల లో 17 ఎకరాల ప్రభుత్వ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మించనున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ స్థలంలో అన్ని హంగులతో యంగ్ ఇండియా స్కూలును నిర్మించనున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో త్వరలోనే స్కూల్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.