కాగజ్‌నగర్, వెలుగు : ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో కాగజ్‌నగర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం పట్టణానికి ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో గొడవ పడి తిట్టుకున్నారు. ఈ గొడవ గురించి ఇరు వర్గాలకు తెలియడంతో వారంతా వచ్చి స్థానిక ఈఎస్‌ఐ వద్ద, మెయిన్ మార్కెట్ ఫ్లైఓవర్ సమీపంలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మార్కెట్‌లో ఉన్న ఓ వర్గానికి చెందిన జ్యూస్ సెంటర్ ధ్వంసమైంది.
దీంతో పరిస్థితి మరింత విషమించి, రెండు వర్గాలకు చెందిన వారు పోటాపోటీగా నినాదాలు చేస్తూ దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ శ్రీనివాసరావు అర్ధరాత్రి కాగజ్‌నగర్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎవరూ గొడవలకు దిగవద్దని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవ ఘటనలో సోమవారం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రామానుజం తెలిపారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.