రాష్ట్రంలో నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. సమక్క, సారలమ్మ నుంచి భద్రాచలం వరకు నాలుగో విడత పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినా, తాము నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాము పాదయాత్ర నిర్వహిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ కూడా తిరగాలన్నారు.
రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో.. టీఆర్ఎస్ పై బీజేపీ సమర శంఖం పూరించింది. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల ఆదరణ పొందడానికి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర సాగిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా పాదయాత్రను పూర్తి చేశారు. తాజాగా నాలుగో విడత పాదయాత్ర తేదీని కూడా ఖరారు చేశారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేసే విషయంలో బీజేపీ జాతీయ పార్టీ పూర్తి బాసటగా నిలుస్తోంది. కేంద్రం నుండి పలువురు నేతలు పాదయాత్ర ప్రారంభం, ముగింపు సభలలో పాల్గొంటున్నారు.
- మొదటి విడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైంది. అక్టోబర్ 02వ తేదీన హుస్నాబాద్ లో పాదయాత్ర ముగిసింది.
- రెండో విడత పాదయాత్ర బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగిసింది.
- మూడో విడత పాదయాత్ర యాదాద్రి నుంచి ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద పాదయాత్ర ముగిసింది.