ఈ రిపోర్టర్ను మెచ్చుకోకుండా ఉండలేరు.. ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ ఓవరాక్షన్ చేయకుండా..

ఈ రిపోర్టర్ను మెచ్చుకోకుండా ఉండలేరు.. ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ ఓవరాక్షన్ చేయకుండా..

మనిషి చస్తుంటే ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ చోద్యం చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను ట్రెండ్ చేస్తు్న్నారు. చర్చ జరిగేలా చేస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. యాక్సిడెంట్ అయినా.. అది విపత్తు అయినా.. ఇంకేదైనా సాయం చేయాల్సిన చేతులు.. ఫోన్లు పట్టుకుని రీల్స్, షార్ట్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న విత ప్రపంచంలో బతుకుతున్నాం. ఇలాంటి రోజుల్లో.. అందులోనూ న్యూస్ ఛానెల్ వాళ్లు.. కెమెరాలు వదిలేసి.. మనిషిని కాపాడారు.. విచిత్రంగా అనిపించినా.. చేయాల్సిందే ఇదే అయినా.. ఇప్పుడు మాత్రం ఈ వార్త వైరల్ అయ్యింది. చేయాల్సిన పని చేస్తేనే పెద్ద వార్త అయ్యింది అంటే అర్థం చేసుకోండి.. అసలు ఎవరూ ఇప్పుడు ఇలా చేయటం లేదు అని.. అంతేనా.. ఈ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని అట్లాంటాలో హెలెన్ హరికేన్ తుఫాన్  దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. ఈ వరద బీభత్సాన్ని రిపోర్ట్ చేసేందుకు ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ తెల్లవారుజామున రిపోర్టింగ్కు వెళ్లాడు. చుట్టూ ఎటు చూసినా వరద నీళ్లు. వరదలు చేసిన విధ్వంసంపై రిపోర్టింగ్ చేస్తుండగా ఓ మహిళ సాయం కోరుతూ కేకలు వేయడం అతని చెవిన పడింది. వెంటనే సదరు రిపోర్టర్ బాబ్ వ్యాన్ డిల్లేన్ మానవత్వంతో స్పందించాడు. రిపోర్టింగ్ ఆపేసి ఒక మనిషిగా సాటి మనిషికి సాయం చేశాడు. దాదాపు పీకల లోతు నీళ్లలో ఆమె కారు వద్దకు వెళ్లి.. కారులో చిక్కుకున్న ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశాడు.

ALSO READ | ఆధ్యాత్మికం: కర్తవ్యం, బాధ్యత మధ్య తేడా ఇదే..

 

కారులో ఉన్న ఆమెకు మెడ వరకూ నీళ్లొచ్చేశాయ్. ఆమెను ఆ స్థితిలో చూసి చలించిపోయిన రిపోర్టర్ విండో తీయమని ఆమెకు చెప్పాడు. కారు నీళ్లలో మునిగిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ  ఎలక్ట్రికల్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంది. కారులో ఉండే ఎలక్ట్రికల్ బోర్డ్స్ నీటి వల్ల షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో విండో ఓపెన్ అయింది. ఆమె సీట్ బెల్ట్ను తీసేసి సదరు రిపోర్టర్ ఆమెను కారులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. తన వీపుపై చిన్న పిల్ల మాదిరిగా బాధితురాలిని ఎక్కించుకుని నడి నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి ఆమెను చేర్చాడు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. రిపోర్టర్ చేసిన సాయాన్ని  నెటిజన్లు అభినందించారు. రిపోర్టింగ్ చేస్తూ కెమెరా ఆమె వైపు చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ కోసం పాకులాడకుండా, వరదల్లో మహిళ మునిగిపోతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని పైత్యపు పోకడలకు పోకుండా మానవత్వంతో స్పందించడంతో రిపోర్టర్ బాబ్ వ్యాన్ డిల్లేన్పై ప్రశంసల జల్లు కురిసింది. మీడియా రిపోర్టర్లంతా బ్రేకింగ్ న్యూస్ కోసం పాకులాడకుండా ఇలా సాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ముందుకొచ్చి బాధితులకు అండగా నిలవాలని నెటిజన్లు హితవు పలికారు.