- ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
- సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ
- మహానగరంలో పెట్టుబడులకు సానుకూలత
ఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యాంగ్ లియూ నేతృత్వంలో ని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ బృందానికి వివరించారు.
ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నామని తెలిపారు.