![మేడిన్ తెలంగాణ ఎయిర్ పాడ్స్..తక్కువ ధరకే..](https://static.v6velugu.com/uploads/2023/03/Foxconn-company_9zEs5GZ3Rc.jpg)
ఎయిర్ పాడ్స్ తక్కువ ధరకే లభించనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలాక్ట్రానిక్స్ తయారీదారు..యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్ కాన్ తెలంగాణలో ప్లాంట్ పెట్టనుంది. రాష్ట్రంలో పర్యటించిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్..ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో దాదాపు 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు కానుంది.
తక్కువ ధరకే...
తెలంగాణలో ఎయిర్ పాడ్స్ ప్లాంట్ ను నెలకొల్పనున్న ఫాక్స్ కాన్ 200 మిలియన్ డాలర్లు..అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1,654 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. వేసవి కాలంలోపు ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించి...2023 చివరి నాటికి లేదా..2024 ఏడాది ప్రారంభం నాటికి ప్లాంట్‌ను ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. యాపిల్ కంపెనీ మొబైల్ ఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇతర అన్ని ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఫాక్స్‌కాన్ సంస్థే తయారు చేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్‌లోని ప్లాంట్‌ను నెలకొల్పి..అందులో ఐ ఫోన్లు తయారుచేస్తోంది. ఇక ఎయిర్‌పాడ్స్ తయారీ చైనాలో మాత్రమే జరుగుతుండగా...చైనాతో పాటు భారత్‌లో కూడా ప్లాంట్ నెలకొల్పాలన్న యాపిల్ సూచనతో ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో ఎయిర్ పాడ్స్ తయారైతే..వినియోగదారులకు అతి తక్కువ ధరకే ఎయిర్ పాడ్స్ లభించనున్నాయి.