కొంగర కలాన్‌లో 186 ఎకరాల సేకరణకు ఫాక్స్‌కాన్ ప్లాన్

ప్రపంచంలోనే 70 శాతం ఐఫోన్‌లను అసెంబుల్ చేసే తైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ తెలంగాణ కోసం ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా కొంగర కలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లతో కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది.

ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (FIT), దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ వద్ద 186.7 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదించింది. దీన్ని 23.8 మిలియన్ US డాలర్లకు (సుమారు రూ.196 కోట్లకు సమానం) కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు టీఎస్ఐఐసీ (TSIIC) సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఫాక్స్‌కాన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అందులో కర్మాగారాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వసతి గృహాలను నిర్మించడం కోసం ఈ ప్రతిపాదిత భూ సేకరణ అని పేర్కొంది. ప్రతిపాదిత భూసేకరణకు సంబంధించిన అంశాలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పలు చర్చల తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది.

తెలంగాణలోని కొంగర కలాన్ పార్కులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుపై ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ లియు మార్చి 6న ప్రకటన చేశారు. అంతకుముందు టీ వర్క్స్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యంగ్ లియు.. సీఎం కేసీఆర్ తో విస్తృతంగా సమావేశమయ్యారు. కొంగర కలాన్ పార్క్‌లో ఫాక్స్‌కాన్ ఒక లక్ష ప్రత్యక్ష ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలో యువతకు పరోక్షంగా ఉపాధి కలుగుతుండడం విశేషం. ఆ తర్వాత తైవాన్‌కు తిరిగి వచ్చిన వెంటనే యంగ్ లియు తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.