న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు దేశ మార్కెట్ల నుంచి ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవడం కొనసాగుతోంది. 2021–22 లో రికార్డ్ లెవెల్‌లో షేర్లను అమ్మిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), 2022–23 లో నికరంగా రూ.37,631 కోట్లను షేర్ మార్కెట్ నుంచి బయటకు తీసేశారు. గ్లోబల్‌గా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్నాయి. ఫలితంగా బాండ్ మార్కెట్‌లు ఆకర్షణీయంగా మారడంతో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లలో తమ పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా మారతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఇండియా ఎకానమీ మరింతగా పెరిగే అవకాశం ఉండడమే కారణమని వెల్లడించారు. కాగా, ఈ నెల 3 నుంచి 6 మధ్య ఎఫ్‌పీఐలు మార్కెట్‌లో రూ.3,747 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌లోకి వచ్చే విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లను వివిధ అంశాలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. యూఎస్ ఫెడ్ పాలసీ వైఖరీ, ఆయిల్ ధరల కదలికలు, జియోపొలిటికల్ పరిస్థితులు ఎఫ్‌పీఐ ఫ్లోస్‌ను నిర్ణయిస్తాయని చెప్పారు.
ఇదే మొదటిసారి..
ఎఫ్‌పీఐలు దేశ మార్కెట్‌లో1993 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ, వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలలో వీరు నికర అమ్మకందారులుగా ఉండడం ఇదే మొదటిసారి. 2021–22 లో నికరంగా రూ.1.4 లక్షల కోట్ల విలువైన షేర్లను, 2022–23 లో రూ.37,632 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు అమ్మినట్టు డిపాజిటరీ డేటా ద్వారా తెలుస్తోంది. కానీ, 2020–21 లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.2.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు.