
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నిధులు గుమ్మరించారు. వీళ్లు గత వారం దాదాపు రూ.8,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్ సెంటిమెంట్బలపడటం, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉండటం, టారిఫ్‌ల టెన్షన్లు తగ్గడం ఇందుకు కారణాలు. ఈ నెల18తో ముగిసిన వారంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ.8,472 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇదే నెల 15న వీళ్లు రూ.2,352 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా, తరువాతి రెండు రోజుల్లో రూ.10,824 కోట్లు ఇన్వెస్ట్‌చేశారు.
ప్రస్తుతం ఎఫ్‌పీఐల డబ్బులు బాగానే వస్తున్నాయని, అయితే ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, యూఎస్ వాణిజ్య విధానాలు, భారతదేశ దేశీయ వృద్ధి అంచనాలను బట్టి ఇవి మారుతూ ఉండవచ్చని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ డైరెక్టర్, రీసెర్చ్- మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. గత వారంలో ఏప్రిల్ 15 నుంచి 17 వరకు కేవలం మంగళవారం, బుధవారం, గురువారం ట్రేడింగ్‌జరిగింది. అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే కారణంగా సోమవారం ,శుక్రవారం స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు.
అమ్మకాలూ ఎక్కువే...
ఎఫ్‌పీఐలు ఈనెల ఇప్పటి వరకు ఈక్విటీల నుంచి రూ.23,103 కోట్లు ఉపసంహరించుకున్నారు. 2025 ప్రారంభం నుంచి మొత్తం అవుట్‌ఫ్లో రూ.1.4 లక్షల కోట్ల వరకు ఉంది. ఈ నెల మొదట్లో ఎఫ్‌పీఐలు విపరీతంగా అమ్మకాలకు దిగారు. యూఎస్ టారిఫ్ పాలసీల ఎదురైన ప్రపంచ అనిశ్చితులు వాళ్ల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. అయినప్పటికీ, మనదేశ ఆర్థిక వ్యవస్థ బాగుండటం, ప్రపంచ వాణిజ్య సమస్యల ప్రభావం తక్కువ ఉండటం, ఈక్విటీ మార్కెట్లలో ఇటీవలి కరెక్షన్తో వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడం వంటివి వాళ్ల నమ్మకాన్ని పెంచాయని శ్రీవాస్తవ అన్నారు.
డాలర్ ఇండెక్స్ దాదాపు 100 స్థాయికి తగ్గడం, డాలర్‌లో మరింత బలహీనపడుతుందన్న అంచనాలు ఎఫ్‌పీఐలను యూఎస్ నుంచి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దగ్గర చేస్తున్నాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
ఇండియా వృద్ధిపై ఆశలు..
యూఎస్, చైనాలు ఈ సంవత్సరం తక్కువ వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. దీనివల్ల ఇండియా మార్కెట్లూ బలంగా ఉంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐలు గత నెల రూ.3,973 కోట్లు , ఎఫ్‌పీఐలు రూ.34,574 కోట్లు ఉపసంహరించుకున్నారు. జనవరిలో, ఔట్‌ఫ్లో రూ.78,027 కోట్లుగా ఉంది. ఎఫ్‌పీఐలు సహా అన్ని పెట్టుబడిదారుల దృష్టి ఆర్థిక, టెలికాం, విమానయానం, సిమెంట్, కొన్ని ఆటో స్టాక్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలపైఉండే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ విజయకుమార్ అన్నారు.
రూ.3.84 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
అత్యంత విలువైన టాప్-టెన్ కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.3,84,004.73 కోట్లు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ భారీగా లాభపడ్డాయి. సుంకాల వాయిదా, కొన్ని ప్రొడక్టులకు మినహాయింపులు ఇవ్వడంతో మార్కెట్లు గత వారం 4.5 శాతానికిపైగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 76,483.95 కోట్లు పెరిగి రూ. 14,58,934.32 కోట్లకు చేరుకుంది. ఇది టాప్-టెన్ కంపెనీలలో అత్యధికం. ఎయిర్‌టెల్ ఎంక్యాప్రూ. 75,210.77 కోట్లు పెరిగి రూ. 10,77,241.74 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 74,766.36 కోట్లు పెరిగి రూ. 17,24,768.59 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 67,597 కోట్లు పెరిగి రూ. 10,01,948.86 కోట్లు అయింది.
ఎస్బీఐ ఎంక్యాప్ రూ.38,420.49 కోట్లు పెరిగి రూ.7,11,381.46 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ ఎంక్యాప్ రూ.24,114.55 కోట్లు పెరిగి రూ.11,93,588.98 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,712.85 కోట్లు పెరిగి రూ.5,68,061.13 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,820.2 కోట్లు పెరిగి రూ.5,34,665.77 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.3,987.14 కోట్లు పెరిగి రూ.5,89,846.48 కోట్లకు చేరుకుంది. హెచ్‌యూఎల్ విలువ రూ.1,891.42 కోట్లు పెరిగి రూ.5,57,945.69 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ అత్యంత విలువైన దేశీయ సంస్థగా నిలిచింది. తర్వాతస్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ ఉన్నాయి.