Euro Cup 2024: యూరో సెమీస్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్.. రొనాల్డోకు తప్పని నిరాశ

Euro Cup 2024: యూరో సెమీస్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్.. రొనాల్డోకు తప్పని నిరాశ

తన చివరి యూరో కప్ లో పోర్చుగల్ కు ట్రోఫీ అందించాలనుకున్న క్రిస్టియానో రోనాల్డో కల నెరవేరలేదు. క్వార్టర్ ఫైనల్ వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా వచ్చిన రోనాల్డో సేన ఫ్రాన్స్ ధాటికి సెమీస్ చేరడంలో విఫలమైంది. శుక్రవారం (జూలై 5) అర్ధ రాత్రి ఫ్రాన్స్ పై జరిగిన క్వార్టర్ ఫైనల్ లో పరాజయం పాలైంది. దీంతో యూరో సెమీ ఫైనల్ కు ఫ్రాన్స్ దూసుకెళ్ళగా.. పోర్చుగల్  క్వార్టర్ ఫైనల్ తో సరిపెట్టుకుంది. తన చివరి యూరో అని టోర్నీకి ముందు చెప్పిన రోనాల్డో.. మ్యాచ్ ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు.

మ్యాచ్ మొత్తం హోరా హోరీగా సాగింది. తొలి 90 నిమిషాల్లో ఇరు జట్లు నువ్వా నేనా అని పోటీ పడడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో అదనపు సమయాన్ని 30 నిమిషాల పాటు మ్యాచ్ జరిగినా గోల్ పడలేదు. అయితే పెనాల్టీలో మాత్రం ఫ్రాన్స్ దూకుడు చూపించింది. 5-3 తేడాతో పోర్చుగల్ ను ఓడించింది. ఫ్రాన్స్ తమ పెనాల్టీలన్నింటినీ గోల్‌గా వేసింది. మరోవైపు పోర్చుగల్ 3 గోల్స్ మాత్రమే వేయగలిగింది. స్పెయిన్‌తో ఫ్రాన్స్ సెమీ-ఫైనల్ పోరులో తలపడనుంది. 

పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ తరపున బార్కోలా, ఉస్మాన్ డెంబెలే, యూసౌఫ్ ఫోఫానా, జూల్స్ కౌండే,థియో హెర్నాండెజ్ తమ స్పాట్-కిక్‌లను విజయవంతంగా మార్చారు. పెనాల్టీ షూటౌట్ లో మేజర్ లీగ్ లో ఫ్రాన్స్ కు చేదు జ్ఞాపాకాలు ఉన్నాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. ఇక చివరిసారిగా జరిగిన యూరోలో ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ పై ఓడిపోయింది. అయితే ఈ సారి మాత్రం ఫ్రాన్స్ గురి తప్పకుండా పోర్చుగల్ ను ఇంటికి పంపింది.