యుద్ధ విమానాల రారాజు: కాంపౌండ్​లో 110 ఫైటర్​ జెట్లు

40 ఏళ్లుగా సేకరిస్తున్న ఫ్రాన్స్​ మాజీ ఫైటర్​ పైలట్​

ఇన్ని యుద్ధ విమానాలున్న అతిపెద్ద ప్రైవేట్​ సంస్థగా గిన్నిస్​ గుర్తింపు

మిగ్​ 21 నుంచి మిరాజ్​ 2000 దాకా.. ఎఫ్​ 16 నుంచి ఎఫ్​ 104 స్టార్​ఫైటర్​ దాకా.. ఒకటా రెండా 110 యుద్ధ విమానాలు ఒక దాని పక్కన మరొకటి హాయిగా సేద తీరుతున్నాయి. అలాగని అదేం మిలటరీ బేస్​ కాదు. ఎయిర్​పోర్ట్​ అంతకన్నా కాదు. ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తి దగ్గర ఉన్న ప్రముఖ దేశాల యుద్ధ విమానాలు. ఫ్రాన్స్​కు చెందిన మిషెల్​ పోంట్​ అనే 87 ఏళ్ల వ్యక్తి ఈ పాత యుద్ధ విమానాలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. మిలటరీలో ఎన్నో ఏళ్లపాటు యుద్ధ విమానాలను నడిపిన ఆయన, వాటిపై ఇష్టాన్ని పెంచుకున్నారు.

ఆ ఇష్టంతోనే 1980లో ‘ద షాట్యూ డి సేవినీలిస్​ బ్యూని’ పేరిట ఓ కెజిల్​ను బర్గండీలో తెరిచారు. అప్పటి నుంచి పాత యుద్ధ విమానాలను  ముక్కలు ముక్కలుగా చేసేయాలని భావించే దేశాలకు వెళ్లి,  వాటిని సేకరించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 110 పాత యుద్ధ విమానాలను తన కెజిల్​లో భద్రంగా దాచారాయన. అంతేకాదు, 8 ఏళ్లుగా ఫ్రాన్స్​ నిర్వహిస్తున్న చాంపియన్​షిప్​లో 168 ట్రోఫీలను కూడా గెలుచుకున్నారు. అవే కాదు, 200 ఆనాటి బైకులు, 36 రేసింగ్​ కార్లూ ఆయన కాంపౌండ్​లో ఉన్నాయి.

ఇక, ఉన్న విమానాల్లో ఎక్కువగా బెల్జియం, రష్యా, చెక్​ రిపబ్లిక్​, పోలండ్​ల నుంచి వచ్చినవే. ఇవన్నీ చూసిన గిన్నిస్​ బుక్కోళ్లు, ప్రపంచంలోనే ఎక్కువ యుద్ధ విమానాలను కలిగి ఉన్న అతి పెద్ద ప్రైవేట్​ సంస్థగా రికార్డు ఇచ్చింది. అయితే, వివిధ దేశాల్లోని ఆ యుద్ధ విమానాలను తన దగ్గరకు తెచ్చుకోవడం చాలా పెద్ద పని కాబట్టి.. అక్కడికే మెకానిక్​లను తీసుకెళ్లి, పార్టులుపార్టులుగా విడగొట్టి విమానంలో తెచ్చేసుకునేవారు. మళ్లీ తన కెజిల్​లో వాటిని బిగించుకునేవారు. ఒకసారి డిజిబౌటిలోని ఎయిర్​పోర్ట్​ రన్​వేపై తానే స్వయంగా ఓ విమానాన్ని విడగొట్టి తెచ్చుకున్నారు. ప్రస్తుతం 30 ఎకరాల్లో ఉన్న ఆ కెజిల్​ను ఏటా 40 వేల మంది వచ్చి యుద్ధ విమానాలను చూసి వెళ్తుంటారు. ప్రారంభించిన మొదట్లో 50 నుంచి 100 మంది మాత్రమే వచ్చేవారంటారు మిషెల్​!!

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి