ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్ లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గాబ్రియేల్ అట్టల్ ను ప్రధానిగా నియమించారు. దీంతో ఫ్రాన్స్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నియమితులైన గాబ్రియేల్ ఓ గే(స్వలింగ సంపర్కుడు) కావడంతో ఇప్పుడాయన చర్చనీయాంశంగా మారారు.
విదేశీయులను బహిష్కరించే ప్రభుత్వ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఇమ్మిగ్రేషన్ చట్టంపై ఇటీవలి రాజకీయ గందరగోళం కారణంగా అతని కంటే ముందు ప్రధానిగా ఉన్న ఎలిసబెత్ బోర్న్ జనవరి 8న రాజీనామా చేశారు. 2027లో పదవీకాలం ముగియనున్న 46 ఏళ్ల మధ్యవర్తి అయిన మాక్రాన్ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది జూన్ లో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి కూడా ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో మాక్రాన్ ఉన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన ప్రభుత్వంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతో బదులివ్వాలని ఆయన భావిస్తున్నారు.