- సౌదీ నుంచి నికరాగువా వెళ్తున్న ఫ్లైట్
- ఏ340 ఎయిర్ బస్‌లో 303 మంది ప్రయాణికులు
- ఫ్యూయెల్ కోసం ఫ్రాన్స్‌లో దిగిన వెంటనే అదుపులోకి
- ఒక్కొక్కరిని విచారిస్తున్న అధికారులు
- ప్యాసింజర్లలో ఎక్కువ మంది ఇండియన్సే
పారిస్: మానవ అక్రమ రవాణా జరుగుతున్నదన్న అనుమానంతో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అధికారులు 303 మంది ప్రయాణికులను తమ ఆధీనంలో తీసుకున్నారు. ఈ విషయమై ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు శనివారం స్పందించారు. ఫ్రాన్స్ అధికారులు తమకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, 303 మంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారని వివరించారు. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బస్ ఏ340 యూఏఈ నుంచి సెంట్రల్ అమెరికాలోని నికరాగువాకు బయల్దేరింది. ఫ్యూయెల్ కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాన్స్ అధికారులకు టిప్ ఇచ్చారు. దీంతో ఫ్లైట్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ప్రయాణికులందరినీ టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. ఒక్కొక్కరికి ఒక్కో బెడ్ ఏర్పాటు చేసి అన్ని సౌలత్లు కల్పించారు.
అదుపులో ఇద్దరు అనుమానితులు
ఇద్దరు అనుమానితులను ఫ్రాన్స్ నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తున్నదని, ఐడీ కార్డులు, ట్రావెల్ బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తున్నదని తెలిపింది. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనేది ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఫ్రాన్స్ అధికారులతో టచ్‌లో ఉంటూ విచారణలో సహకరిస్తున్నామని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వీరంతా నికరాగువా వెళ్తున్నారని, అందులో కొంత మంది కెనడా లేదా అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్ చట్టం ప్రకారం.. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారించే పవర్ ఇక్కడి అధికారులకు ఉంటుందని, పరిస్థితిని బట్టి కొన్ని రోజుల పాటు కూడా వాళ్ల ఆధీనంలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. విమానంలో హ్యుమన్ ట్రాఫికింగ్ బాధితులు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని, అందుకే విచారిస్తున్నామని ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ప్రకటించింది. బార్డర్ పోలీసులు, ఏవియేషన్ జెండర్మ్స్ తో కలిసి ఫ్రాన్స్ నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ పని చేస్తున్నదని తెలిపింది.