- రైలు పట్టాలు ధ్వంసం.. పలు ట్రైన్లకు నిప్పు
- ఒలింపిక్స్ గేమ్స్ ఓపెనింగ్‌కు ముందు ఘటన
- 8 లక్షల మందిపై ప్రభావం..దేశవ్యాప్తంగా హైఅలర్ట్
పారిస్: ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రైలు పట్టాలను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం అవుతాయనడానికి ముందు ఈ ఘటన జరిగింది. ఈ దాడితో 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌పై దాడి చేశారు. ఈ దాడిని విద్రోహ చర్యగా భావిస్తున్నాం. టీజీవీ నెట్వర్క్ స్తంభించిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా మార్గాల్లో రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది.
అట్లాంటిక్, నార్తర్న్, ఈస్ట్రన్ రైల్వే నెట్వర్క్ దెబ్బతిన్నది. గురువారం అర్ధరాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు’’ అని ఎస్ఎన్సీఎఫ్ అధికారులు అన్నారు. ఒలింపిక్స్ గేమ్స్‌కు.. రైల్వే నెట్‌వర్క్‌పై దాడులకు సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందన్నారు. కాగా, రైల్వే నెట్‌వర్క్‌పై దుండగుల దాడి నేపథ్యంలో.. ఒలింపిక్స్ క్రీడా ప్రాంగణానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.