ఫ్రాన్స్​లో టెలికం నెట్​వర్క్ పై దాడి

ఫ్రాన్స్​లో టెలికం నెట్​వర్క్ పై దాడి
  • దెబ్బతిన్న ఫైబర్ నెట్​వర్క్, టెలీ కమ్యూనికేషన్ సిస్టమ్
  • మొబైల్ ఫోన్లు బంద్.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జనం

ప్యారిస్: ఫ్రాన్స్​లో టెలికాం నెట్​వర్క్​పై దాడి జరిగింది. దీంతో టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. మొబైల్ ఫోన్లు, ల్యాండ్​లైన్లు పనిచేయలేదు. దేశంలోని 6 ప్రాంతాల్లోని లక్షలాది మందిపై ఎఫెక్ట్ పడింది. ఇటీవల ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రైల్వే కేబుల్స్ సిస్టమ్ పై కొందరు దాడి చేసి కాల్చివేయగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు టెలికాం నెట్​వర్క్ పై దాడి  జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

ఒలింపిక్స్ సమయంలో ఇలా జరగడంపై ఫ్రెంచ్ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. కొన్ని విధ్వంసకర చర్యల కారణంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు టెలీ కమ్యూనికేషన్లు, ఫైబర్ లైన్లు, మొబైల్ ఫోన్​ సర్వీసులకు అంతరాయం కలిగిందని చెప్పింది. ఒలింపిక్ సాకర్, సెయిలింగ్ పోటీలను నిర్వహిస్తున్న మార్సెయిల్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ఆరు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల డిజిటల్ సర్వీసులు కూడా పనిచేయలేదని ఫ్రెంచ్ పోలీస్ విభాగం తెలిపింది. అయితే, ఒలింపిక్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడిందా లేదా అనేది మాత్రం వెల్లడించలేదు.