
- లాగిన్ ఐడీ, సెక్యూరిటీ ఫీచర్లు మార్చేస్తున్న స్కామర్లు
- క్యాండిడేట్స్ ను లాగవుట్చేసి డబ్బులు వసూలు
- స్లాట్ బుకింగ్‌లో జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచనలు
ఎల్బీనగర్కు చెందిన ఓ ఫార్మా ఉద్యోగి విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం అప్లై చేశాడు. మొదటి ఇంటర్వ్యూలో అర్హత సాధించలేదు. వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ప్రాసెస్ చేశాడు. తక్కువ టైంలో వీసా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని చెప్పడంతో నమ్మాడు. ప్రాసెసింగ్కోసం తొలి విడతలో రూ.5 వేలు కట్టాడు. తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ రావడంతో మరో రూ.10 వేలు చెల్లించాడు. తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ తో సూచించిన ప్రాంతానికి వెళ్తే అది ఫేక్ లెటర్, తాను మోసపోయానని తెలుసుకున్నా డు. బేగంపేటలోని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులను ఆశ్రయించాడు.
సంతోష్ నగర్‌కు చెందిన ఓ యువకుడు వీసా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేశాడు. డైరెక్ట్‌గా వెళ్తే వీసాకు అర్హత సాధించనేమోనని ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. ప్రాసెసింగ్కోసం ఆ ఏజెంట్ వివిధ రకాల ఫీజులతోపాటు అదనంగా రూ.13 వేలు తీసుకున్నాడు. చివరకు వీసా స్లాట్ బుక్ అయ్యిందని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు. ఫొటోషాప్‌తో అపాయింట్‌మెంట్ లెటర్ ఉండడంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు. చివరకు అది ఫేక్అని తెలుసుకున్నాడు.
హైదరాబాద్, వెలుగు:వీసా స్లాట్ బుకింగ్ పేరుతో ఏజెంట్లు, స్కామర్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తక్కువ టైంలో వీసాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ వివిధ రకాల ఫీజుల రూపంలో అందినంత దోచేస్తున్నారు. లాగిన్ ఐడీలు మార్చి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తున్నారు. ప్రధానంగా సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పైనే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూఎస్ డ్రాప్ బాక్స్ నిబంధనల్లో మార్పుల నేపథ్యంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది.
అంతా తామే చూసుకుంటామని..
విద్య, ఉద్యోగాలు సహా ఇతర అవసరాల కోసం అమెరికా ఇతర దేశాలకు వెళ్లే ఇండియన్లకు వీసా తప్పనిసరి. కేటగిరీల వారీగా నిర్ణీత గడువుతో ఆయా దేశాలు వీసాలు మంజూరు చేస్తుంటాయి. వీసాల కోసం జరిగే ఇంటర్వ్యూల కోసం ముందుగా అభ్యర్థులు స్లాట్‌బుక్ చేసుకుంటారు. నిర్దేశించిన సమయం, ప్రాంతంలో ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు. ఇందులో అర్హత సాధించిన వారికి మాత్రమే వీసా వస్తుంది.
దీన్నే కొంత మంది ట్రావెల్ ఏజెంట్లు, స్కామర్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇంటర్వ్యూలో పాస్ అయ్యేందుకు, అత్యంత సులువుగా వీసా వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని నమ్మిస్తున్నారు.
ఫొటోషాప్‌తో ఫేక్ అపాయింట్మెంట్లెటర్లు
స్కిల్స్ఉంటే తప్ప ప్రస్తుతం వీసాలు వచ్చే అవకాశాలు లేవు. దీన్నే ఏజెంట్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వేదికగా చేసుకుని ప్రకటనలు ఇస్తున్నారు. ఇవి చూసిన అభ్యర్థులు ఏజెంట్లను సంప్రదించి వారు పంపించే లింకులతో వీసా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు.
ముందు వ్యక్తిగత లాగిన్ ఐడీ, పాస్వర్డ్స్తోనే అప్లై చేస్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిగత డేటా సేకరిస్తున్న ఏజెంట్లు ఫొటోషాప్‌తో క్రియేట్ చేసిన చేసిన వీసా ఇంటర్వ్యూ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిస్తున్నారు. తర్వాత లాగిన్ ఐడీలు, సెక్యూరిటీ ఫీచర్స్ మారుస్తుండడంతో అపాయింట్‌మెంట్ లెటర్నకిలీదా లేదా నిజమైనదా అన్నది తెలియడం లేదు.
లాగిన్ ఐడీలు మార్చి ఏమారుస్తున్నరు
మోసగాళ్లు.. అభ్యర్థుల లాగిన్ ఐడీతో మరో అకౌంట్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా మారుస్తున్నారు. దీనివల్ల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్‌సైట్‌లో సంబంధిత అభ్యర్థి లాగ్ అవుట్ అయిపోతాడు. తర్వాత అభ్యర్థులు యాక్సెస్ కోల్పోతారు. ఈ క్రమంలోనే నకిలీ అపాయింట్‌మెంట్ పంపిస్తున్నారు.
అభ్యర్థుల నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. లాగిన్ ఐడీ అడిగితే డబ్బులు అడుగుతున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లోనే ఈ–మెయిల్ ఐడీ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవడం ద్వారా మోసాలబారిన పడకుండా ఉండొచ్చని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.