సాయం చేస్తాడని నమ్మితే.. రూ. 18 లక్షలు స్వాహా చేసిండు

సాయం చేస్తాడని నమ్మితే.. రూ. 18 లక్షలు స్వాహా చేసిండు

జగిత్యాల టౌన్, వెలుగు: ఓ రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగి.. తనకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ మీద అవగాహన లేకపోవడంతో పక్కనే ఉన్న ఓ యువకుడిని నమ్మి సాయం కోరాడు. డబ్బులకు ఆశపడిన ఆ యువకుడు వృద్ధుడిని మోసం చేసి అతడి డబ్బులను దర్జాగా కాజేశాడు. ఇందుకోసం ఆ యువకుడు ఏకంగా తన మొబైల్‌‌‌‌ నంబర్‌‌‌‌నే వృద్ధుడి అకౌంట్‌‎కు లింక్‌‌‌‌ చేయించాడు. ఇలా 2011 నుంచి పలు దఫాలుగా మొత్తం రూ. 18 లక్షలు కాజేశాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వృద్ధుడు తనకు న్యాయం చేయాలంటూ ఆఫీసర్లను ఆశ్రయించాడు. జగిత్యాల పట్టణంలో జరిగిన ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళ్తే... జగిత్యాలలోని గాంధీ నగర్‌‌‌‌కు చెందిన నక్క లక్ష్మణ్‌‌‌‌కు ఇద్దరు కూతుళ్లు. ఇతడు ఎస్సారెస్పీలో పనిచేసి 20 ఏండ్ల కింద రిటైర్‌‌‌‌ అయ్యాడు. మొదట్లో ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 20 వేల పెన్షన్‌‌‌‌ వచ్చేది. ఇటీవల పెన్షన్‌‌‌‌ పెంచడంతో రూ. 44 వేలు వస్తోంది. లక్ష్మణ్‌‌‌‌కు డబ్బులు విత్‌‌‌‌డ్రా చేయడంపై అవగాహన లేకపోవడంతో ఇంటి పక్కన ఉండే దీకొండ తిరుపతి అనే యువకుడి సాయం కోరాడు. ఇదే అదనుగా భావించిన తిరుపతి తన మొబైల్‌‌‌‌ నంబర్‌‌‌‌‎ను లక్ష్మణ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌కు లింక్‌‌‌‌ చేయించాడు. తర్వాత యూపీఐని ఉపయోగిస్తూ ప్రతి నెలా రూ. 24 వేలు తాను వాడుకుంటూ, లక్ష్మణ్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో రూ. 20 వేలు మాత్రమే ఉంచేవాడు. 

మే నెలలో లక్ష్మణ్‌‌‌‌ అనారోగ్యానికి గురి కావడంతో హాస్పిటల్‌‌‌‌ ఖర్చుల కోసం పెన్షన్‌‌‌‌ డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్‌‌‌‌కు వెళ్లగా అందులో డబ్బులు కనిపించలేదు. దీంతో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీయించగా తిరుపతి చేసిన మోసం బయటపడింది. దీంతో లక్ష్మణ్‌‌‌‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిని పిలిపించి మాట్లాడగా డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో లక్ష్మణ్‌‌‌‌ సోమవారం గ్రీవెన్స్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులు చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌ సూచించారు.