- వ్యాపారవేత్త కూతురుకు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
- డ్రగ్స్ కేసు నుంచి తప్పిస్తామని రూ.50 వేలు డిమాండ్
- సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి కంప్లయింట్
- పాకిస్తాన్‌కు చెందిన నంబర్‌గా గుర్తింపు
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. వాట్సాప్ డీపీలో డీజీపీ రవి గుప్తా ఫొటో ఉంది. డీజీపీగా పరిచయం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని, కేసులో అరెస్ట్ చేస్తామని సదరు యువతిని బెదిరించారు. డ్రగ్స్ కేసు నుంచి తప్పించాలంటే రూ. 50 వేలుఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. వాళ్ల వ్యవహారంపై అనుమానం వచ్చిన యువతి సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది. +92 కోడ్ తో ఉన్న నంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ గా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. అది పాకిస్తాన్ కు చెందిన కోడ్ అని, ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే నమ్మి మోసపోవద్దని సైబర్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.