ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. దంపతుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. దంపతుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు

తహసీల్దార్​నని చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తనంటూ మోసం
దంపతుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు 
జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల సంతకాలు ఫోర్జరీ
కిలాడీ యువతిని అరెస్ట్ చేసిన వికారాబాద్ పోలీసులు

వికారాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి సిటీకి వచ్చి యువకుడిని ప్రేమించింది. తాను తహసీల్దార్ నని అతడిని నమ్మించి పెండ్లి చేసుకుంది. డైలీ ఆఫీసుకు వెళ్తున్నట్లు భర్త, అత్త,మామను నమ్మించింది. తర్వాత ఈజీ మనీ కోసం వికారాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి రూ.2.50 లక్షలు వసూలు చేసి పోలీసులకు పట్టుబడింది. వికారాబాద్ పీఎస్ పరిధిలో నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం డీఎస్పీ నర్సింహులు వెల్లడించారు.  

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోమాస శిరీష (22) కొంతకాలం కిందట సిటీకి వచ్చింది. సిద్ధార్థ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, సిద్ధార్థ్ ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా అతడిని పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని, తహసీల్దార్​నని నమ్మించింది. సిద్ధార్థ్ ను పెండ్లి చేసుకుంది. తనకు ఉద్యోగం లేదని తెలిస్తే అతడు ఎక్కడ వదిలేస్తాడనే భయంతో రోజూ ఆఫీసుకు వెళ్తున్నట్లు నటించేది. భర్త, అత్త,మామకు అనుమానం రాకుండా శిరీష జాగ్రత్త పడింది. అయితే, డబ్బుల కోసం మోసాలకు స్కెచ్ వేసింది. 

అదే టైమ్​లో మౌలాలిలో ఉండే వాణిరెడ్డితో శిరీషకు పరిచయం ఏర్పడింది. తాను రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో తహసీల్దార్​గా పనిచేస్తున్నట్లు వాణిరెడ్డిని నమ్మించి.. అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పింది. ఆ జాబ్ కావాలంటే కొంత డబ్బు ఇవ్వాలంది. శిరీష మాటలు నమ్మిన వాణిరెడ్డి ఆమెకు ఫోన్ పేలో రూ.90 వేలు పంపించింది. వాణిరెడ్డి భర్త కృష్ణారెడ్డికి కూడా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి శిరీష మరో రూ. 1.60 లక్షలు తీసుకుంది. ఫేక్ ఆర్డర్ కాపీలను తయారు చేసిన శిరీష వాటిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను సంతకాలను ఫోర్జరీ చేసి వాణిరెడ్డికి ఇచ్చింది. 


బాధితురాలు ఆర్డర్ కాపీతో వికారాబాద్ కలెక్టరేట్​కు వెళ్లి ఆఫీసులో వాటిని చూపించగా అవి నకిలీ అని అధికారులు తేల్చారు. మోసపోయినట్లు గుర్తించిన వాణిరెడ్డి వెంటనే వికారాబాద్ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. శిరీషపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. శిరీష నుంచి రూ.2.50 లక్షలను రికవరీ చేసి వాణిరెడ్డికి అందజేశారు. నిందితురాలు శిరీషను కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలిస్తామని డీఎస్పీ నర్సింహులు తెలిపారు.