![సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ గోల్మాల్.!ఒక్కో క్వింటాల్‌పై రూ.2వేలకు పైగా దోపిడీ](https://static.v6velugu.com/uploads/2025/02/fraud-in-cci--purchases-in-telangana_lpZHEGSQ1b.jpg)
- తప్పుడు టీఆర్ పత్రాలతో కోట్లలో అక్రమాలు
- రైతుల నుంచి అగ్గువకు కొని సీసీఐకి అమ్మకం
- సీసీఐ అధికారులు, రైతు సంఘాల ఫిర్యాదుతో ఎంక్వైరీ
- అక్రమాలు బట్టబయలు కావడంతో ఏడుగురిపై వేటు
- ఏఈవోలపైనా చర్యలకు రంగం సిద్ధం
హైదరాబాద్, వెలుగు: రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన మార్కెటింగ్ అధికారులు, దళారులతో కుమ్మక్కయ్యారు. లేని రైతుల పేరుతో టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలు సృష్టించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులనే బురిడీ కొట్టించారు. రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొని ఎక్కువ రేటుకు అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌కమిటీ సెక్రటరీలకు భారీ మొత్తంలో ముట్టజెప్పారు. కొందరు సీసీఐ అధికారులు, రైతుసంఘాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయగా, అక్రమాలు బయటపడ్డాయి. దీంతో ఏడుగురు మార్కెట్ సెక్రటరీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం రెండు శాఖల్లో సంచలనం సృష్టించింది.
అక్రమాలకు ఊతమిచ్చిన టీఆర్పత్రాలు
రైతులు సీసీఐ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే ముందుగా ఆయా మండలాల్లోని వ్యవసాయ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇందుకు పట్టా పాస్‌బుక్, ఆధార్‌కార్డు వెంట తీసుకెళ్లి.. తాను ఈ సీజన్లో ఎన్ని ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నది, ఎంత దిగుబడి వస్తున్నది వివరించాలి. దీనిని ధ్రువీకరించుకున్నాక సంబంధిత ఏఈవో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే ముందు సంబంధిత ఏఈవో దగ్గరికి వెళ్తే రిజిస్ట్రేషన్ పత్రాలను ఇస్తారు. వాటిని మార్కెట్‌కు తెస్తేనే సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తారు. కానీ ఈ విషయం తెలియని రైతులు నేరుగా సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొస్తున్నారు. ఇలాంటి వారు వేల మంది ఉండడంతో వీరికి టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) పత్రాలు జారీ చేసే అధికారాన్ని మార్కెట్ సెక్రటరీలకు మార్కెటింగ్‌శాఖ అప్పగించింది. ఇది దళారులకు వరంగా మారింది.
ఏడుగురు కార్యదర్శులపై వేటు
టీఆర్ అక్రమాలపై సీసీఐ అధికారులతోపాటు కొందరు రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్, చెన్నూర్, పెద్దపల్లి, వరంగల్, జనగామ, భద్రాచలం, సిద్దిపేట జిల్లాల్లో ఇటీవల ఎంక్వైరీ చేశారు. ఆయా చోట్ల సీసీఐ కొనుగోళ్ల కోసం జారీ చేసిన టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లో తేడాలను గుర్తించి నివేదిక పంపించారు. దీంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్ సీనియర్ సెక్రటరీ పి. నిర్మల, జనగామ మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, చిన్నకోడూరు మార్కెట్ కార్యదర్శి పరమేశ్వర్, చెన్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ రామాంజనేయులు, భద్రాచలం సెక్రటరీ నామాల శ్రీనివాస్, పెద్దపల్లి సెక్రటరీ పృథ్వీరాజ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్ ను సస్పెండ్‌చేస్తూ.. మార్కెటింగ్ సెక్రటరీ ఉదయ్ ఆదేశాల మేరకు వరంగల్ రీజియన్ మార్కెటింగ్‌శాఖ అధికారి ఉప్పల శ్రీనివాస్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వీరిచ్చిన వివరాల ఆధారంగా ఆయా చోట్ల అగ్రికల్చర్ఆఫీసర్ల పాత్రపైనా ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్టు తెలిసింది. మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఆయా చోట్ల పలువురు ఏఈవోలపైనా వేటు పడవచ్చనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ వ్యవహారం అటు మార్కెటింగ్శాఖతోపాటు ఇటు అగ్రికల్చర్శాఖలో చర్చనీయాంశంగా మారింది.
రైతుల వద్ద రూ.5 వేలకు కొని.. సీసీఐకి రూ.7 వేలకు
టీఆర్ పత్రాలు చేతిలో ఉండడంతో మార్కెట్ కార్యదర్శులు, దళారులతో కలిసి అక్రమాలకు తెరలేపారు. రైతులు పత్తి తేగానే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొన్న దళారులు పత్తి క్వాలిటీ లేదని, గింజ పొడవు లేదని, మాయిశ్చర్ రావడం లేదని రకరకాల సాకులు చెప్పి క్వింటాల్రూ.5 వేలు, ఆలోపే కొని సీసీఐకి రూ.7,121 చొప్పున అమ్ముకున్నారు. ఈక్రమంలో ఒక్కో క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున కోట్లు వెనకేసుకొని.. మార్కెట్ కార్యదర్శులకు కమిషన్ కింద లక్షల్లో ముట్టజెప్పారు. టీఆర్ పత్రాలపై పదే పదే అవే పట్టాదారు పాస్‌బుక్ నంబర్లు వేస్తే దొరికి పోయే ప్రమాదం ఉండడంతో ఏజెన్సీలోని పోడు, పట్టాబుక్లు లేని ఇతర భూముల్లో పత్తి పండించినట్టు చూపిస్తూ.. దందా కొనసా గించారు. ముఖ్యంగా ఏజెన్సీ భూములు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కె ట్ల పరిధిలో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరిగినట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు గుర్తించారు.