కరోనా పేరిట సదురుకుంటన్రు

గద్వాల మున్సిపాలిటీలో రూ. 60 లక్షల బిల్లులు

కాగితం మీద రాసిచ్చే కోవిడ్ ఐడీ కార్డుల పేరిట రూ.1.72 లక్షలు
పది డెడ్ బాడీల ఖననానికి రూ. 2 లక్షలు
బ్లీచింగ్ పౌడర్‌కు రూ. 3.3 లక్షలు
కలెక్టర్ తిప్పి పంపడంతో సాధారణ నిధుల్లోంచి చెల్లించేందుకు తీర్మానం

కరోనా పేరు చెబితేనే జనం వణికిపోతున్నరు. ఏ రూపంల వస్తదో, అసలు బతుకనిస్తదో, చంపేస్తదో తెల్వక ఆగమవుతున్నరు. డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్​ వర్కర్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నరు. కానీ  కొన్ని మున్సిపాలిటీల్లో ఆఫీసర్లు, లీడర్లు ఇదే అదునుగా కరోనా పేరిట సదురుకుంటున్నరు. తాజాగా గద్వాల మున్సిపాలిటీలో మాస్కులు, శానిటైజర్లు, బ్లీచింగ్​పౌడర్, డెడ్​బాడీల ఖననం, గిననం అంట రూ.60 లక్షల దాక బిల్లులు చేసిన్రు. ఒక్కో గొయ్యి తవ్వనీకి ఏకంగా రూ. 20 వేలు ఖర్చు పెట్టినట్లు చూపిన్రు. జనానికి అవగాహన కల్పించనీకి ఆటోలకే రూ. 3 లక్షల దాక బిల్లులు జేసిన్రు. వాటిని చూసి బిత్తరపోయిన కలెక్టర్​ సంతకం పెట్టకుండా వెనక్కి పంపడంతో విషయం బయిటికచ్చింది.

గద్వాల, వెలుగు: కరోనా నివారణ కోసం గద్వాలలో చేపట్టిన పనులు మున్సిపాలిటీలోని కొందరు ఆఫీసర్లకు, పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులకు వరంగా మారాయి. పది ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు బిల్లులు పెట్టి దోచుకోవాలని స్కెచ్ వేశారు. నిజానికి కరోనా కోసం చేపట్టిన పనులకు ప్రభుత్వం నుంచే నిధులు రావాలి.  కానీ కలెక్టర్ ఆఫీస్​ సిబ్బంది ఆ బిల్లులు చూసి అవాక్కై వెనక్కి పంపించారు. దీంతో ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలనుకున్న పాలకమండలి, అధికారులు మున్సిపాలిటీ సాధారణ నిధులు వాడుకునేందుకు వీలుగా మున్సిపల్ మీటింగ్​ ఎజెండాలో చేర్చారు. వాటిపై చర్చ జరిపి మరీ రూ. 60 లక్షల బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో వీటితోపాటు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలనూ చేర్చి, ఆమోదముద్ర వేసుకున్నారు.

ఒక్కో పనికి రూ. లక్షల్లో..

    నిధులు దండుకునేందుకు బ్లీచింగ్ పౌడర్​ మంచి అవకాశంగా మారింది. వీటిని 5 అంశాలుగా చేర్చి 500 సంచులు కొన్నట్లు చూపించారు. ఒకచోట రూ. 78,912, మరో నాలుగుచోట్ల రూ. 63,130  చొప్పున చూపించి మొత్తం రూ. 3లక్షల31వేల432 రూపాయల బిల్లులు రాసుకున్నారు.

    కరోనా వైరస్ తో పది మంది చనిపోయినట్టు చూపించి 10 గుంతలు తవ్వడానికి జేసీబీ ఖర్చు రెండు లక్షలు చూపించారు. ఒక గుంత తవ్వడానికి రూ. 20 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టుకున్నారు. వాస్తవానికి అధికారికంగా చనిపోయింది ఒక్కరు మాత్రమే. మిగిలినవారికి కరోనా లక్షణాలు ఉన్నాయని మున్సిపల్​ఆఫీసర్లు అంటున్నారు. కానీ ఈ మరణాలేవీ కరోనా లెక్కల్లో రాలేదు.

    బస్సులు లేకపోవడంతో అధికారులు తిరగడానికి రెండు నెలలు కారు అద్దె కోసం రూ. 66 వేలు ఖర్చయినట్లు చూపించారు. ఎక్కడినుంచి తిరిగారు.. ఎవరు తిరిగారనే వివరాలు ఎక్కడా పేర్కొనలేదు.

    6500 మాస్క్ లకు రూ. లక్ష ఖర్చు చేసినట్లు చూపించారు. వాటిని ఎక్కడ పంపిణీ చేశారు, ఎవరికి పంపిణీ చేశారనేది ఎక్కడా ప్రస్తావించలేదు. అదేవిధంగా 1300 ఐడీ కార్డుల కోసం రూ. 1,72,900 బిల్లులు పెట్టారు. అంటే ఒక్కో ఐడీ కార్డుకు రూ. 133 ఖర్చయింది. వాస్తవంగా వారు పంపిణీ చేసిన ఐడీ కార్డు,  ఆఫీసరు సంతకం చేసిన ఒక కాగితం మాత్రమే. ఆ పేపరు, దానిపై ప్రింటింగ్​కు రూ.  10 కి మించి  ఖర్చు కాదని కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. చివరికి రూ.133కు  ఒకే చేశారు.

    హైపో క్లోరిన్ స్ప్రే చేసేందుకు ట్రాక్టర్లకు కూడా రూ. 3లక్షల77వేల500 ఖర్చు చేసినట్లు చూపించారు. మందుకయ్యే ఖర్చుకు ఇది అదనం. కేవలం ట్రాక్టర్ కిరాయిలే ఇంత చూపించారు. అదేవిధంగా ఆశ కార్యకర్తలకు సర్వే చేయడానికి వచ్చిన వారికి చాయ్, ఇతర స్టేషనరీ ఖర్చుల కోసం రూ. 60 వేల పైగా ఖర్చు చేసినట్టు బిల్లులు పెట్టుకున్నారు. ఒకరోజు కూడా పనిచేయని కోవిడ్ టన్నెల్ నిర్మాణం కోసం రూ. 70 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులో
పొందుపరిచారు.

    ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టరాదని నిషేధం ఉన్నా గద్వాల మున్సిపాలిటీలో మాత్రం ఫ్లెక్సీలు పెట్టామని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ లోనే తీర్మానం చేశారు. పట్టణంలో 14 ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి రూ. 60,600 బిల్లు పెట్టారు.

కౌన్సిల్ నిర్ణయం మేరకు బిల్లులు
బిల్లుల చెల్లింపులో జాగ్రత్తలు తీసుకుంటాం. ఐడీ కార్డుల బిల్లు ఎక్కువగా ఉంది. దాన్ని రివైజ్డ్ చేస్తం. మిగతావాటికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం మేరకు మేం బిల్లులు చేస్తం.

‑ నరసింహ, మున్సిపల్ కమిషనర్

అవగాహనపైనా కక్కుర్తే..
ఆటోల ద్వారా కరోనా వైరస్ పై అవగాహన కల్పించామని, వాటి ఖర్చు రూ. 3 లక్షల పైచిలుకు అయిందని బిల్లులు చూపించారు. అదే విధంగా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబాలకు, గాంధీ హాస్పిటల్‌కి వెళ్లినవారి కుటుంబాలకు సామగ్రి పంపిణీ చేశామని మరో లక్షా 11 వేల 611 రూపాయల బిల్లు పెట్టారు.

For More News..

ప్రతి 100 టెస్టులకు 10 పాజిటివ్

నన్నెందుకు నామినేట్‌ చేయలేదు?