ఆడేవాళ్లను పక్కనబెట్టి.. ఆడని వాళ్లకు టీమ్‌లో చోటు

  • ఇదేం సెలెక్షన్​
  • ఇద్దరు సెలెక్టర్లతోనే హజారే టోర్నీకి టీమ్ ఎంపిక
  • లోధా రూల్స్‌‌ను బ్రేక్‌ చేసిన హెచ్‌‌సీఏ
  • ప్లేయర్‌నే సెలెక్టర్‌గా మార్చిన వైనం !
  • హెచ్‌‌సీఏపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
  • మరో వివాదంలో అజరుద్దీన్‌ అండ్‌ కో

ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్నిసార్లు పరువుపోగొట్టుకున్నా.. అన్యాయానికి గురైన ఆటగాళ్లు,  వారి పేరెంట్స్‌‌ తిట్టిపోసినా  హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) తీరు మారడం లేదు. టాలెంటెడ్‌‌ ప్లేయర్లకు తొక్కేసి.. పనికిరాని వాళ్లను అందలం ఎక్కించడంలో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. విజయ్‌‌ హజారే ట్రోఫీకి హైదరాబాద్‌‌ టీమ్‌‌ సెలెక్షన్‌‌ విషయంలో లోధా కమిటీ రూల్స్‌‌ను బ్రేక్‌‌ చేయడంతో పాటు జట్టు ఎంపికలో  ప్రతిభావంతులకు అన్యాయం చేసిందని హెచ్‌‌సీఏపై  స్టేట్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ కమిషన్‌‌లో కంప్లైంట్​ నమోదైంది.  ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న హెచ్‌‌సీఏ  ఇప్పుడు హెచ్‌‌ఆర్సీ ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..!

హైదరాబాద్‌‌, వెలుగు: మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ నాయకత్వంలోని హెచ్‌‌సీఏ  మరో వివాదంలో చిక్కుకుంది. బీసీసీఐ విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌‌ టీమ్‌‌ సెలెక్షన్స్‌‌లో కరప్షన్‌‌కు పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కోంటోంది. ఈ నెల 20 నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి  టాలెంటెడ్‌‌ ప్లేయర్లను ఏమాత్రం పట్టించుకోకుండా తమ వాళ్లను, చేతులు తడిపిన వాళ్లనే సెలెక్ట్‌‌ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం రూల్స్‌‌కు విరుద్ధంగా  కేవలం ఇద్దరు మెంబర్లతో కూడిన సెలెక్షన్‌‌ ప్యానెల్‌‌ను ఏర్పాటు చేసిన హెచ్‌‌సీఏ 22 మంది ప్లేయర్లతో కూడిన టీమ్‌‌ను బుధవారం అనౌన్స్‌‌ చేసింది. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం స్టేట్‌‌ టీమ్‌‌ను ఐదుగురు మెంబర్లతో కూడిన సెలెక్షన్‌‌ కమిటీనే ఎంపిక చేయాలి. కానీ, హై డ్రామా మధ్య అర్వింద్‌‌ శెట్టి, అన్వర్‌‌ అహ్మద్‌‌తో అప్పటికప్పుడు కమిటీని ఫామ్‌‌ చేసి మరీ టీమ్‌‌ను ఎంచుకుంది. తాము చెప్పిన వాళ్లనే సెలెక్ట్‌‌ చేయాలని హెచ్‌‌సీఏ పెద్దలు,  క్లబ్‌‌ సెక్రటరీల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండడంతో  ఒరిజినల్‌‌ సెలెక్టర్స్‌‌ అయిన శివాజి యాదవ్‌‌, అభినవ్‌‌ కుమార్‌‌ కమిటీ నుంచి విత్‌‌డ్రా అయినట్టు తెలుస్తోంది. మరో సెలెక్టర్‌‌ అహ్మద్‌‌ ఖాద్రీ ఎస్‌‌బీఐ తరఫున ఇండోర్‌‌లో మ్యాచ్‌‌ ఆడుతున్నాడు. దాంతో, అర్వింద్‌‌, అన్వర్‌‌ అహ్మద్‌‌, హబీబ్‌‌ అహ్మద్‌‌ ముగ్గురితో హెచ్‌‌సీఏ పెద్దలు తొలుత ఓ కమిటీని ఫామ్‌‌ చేశారు. తర్వాత హబీబ్‌‌ కూడా వైదొలగడంతో మిగిలిన ఇద్దరే టీమ్‌‌ను ఎంపిక చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

టాలెంటెడ్‌‌ ప్లేయర్లకు అన్యాయం

విజయ్‌‌ హజారే టోర్నీకి సెలెక్ట్‌‌ చేసిన మెయిన్‌‌ టీమ్‌‌, ఆరుగురు స్టాండ్‌‌ బై ప్లేయర్లలో మెజారిటీ వంతు హెచ్‌‌సీఏ పెద్దల  కబ్స్‌‌కు ఆడిన వాళ్లే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. మల్టిపుల్‌‌ క్లబ్స్‌‌ ఓనర్లు, హెచ్‌‌సీఏ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వారికే చాన్స్‌‌ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.  ముఖ్యంగా గతేడాది రంజీ ట్రోఫీతో పాటు ఈ ఇయర్‌‌ సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో కెప్టెన్‌‌గా ఫెయిలైన తన్మయ్‌‌ అగర్వాల్‌‌కే మళ్లీ కెప్టెన్సీ అప్పగించడం చర్చనీయాంశమైంది. ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో తన్మయ్‌‌ బ్యాటింగ్‌‌లోనూ నిరాశ పరిచాడు. అదే టైమ్‌‌లో మాజీ కెప్టెన్‌‌ అక్షత్‌‌ రెడ్డికి  ముస్తాక్​ అలీతో పాటు ఈ టీమ్‌‌లోనూ చోటివ్వలేదు. హెచ్‌‌సీఏ 3డే లీగ్స్‌‌లో అక్షత్‌‌ రెండు సెంచరీలు, మూడు ఫిఫ్టీలతో బాగానే రాణించాడు. తనే కాదు  ఓ డబుల్​ సెంచరీ, మరో మూడు సెంచరీలతో చెలరేగిన అభిరథ్​​ రెడ్డిని సైతం సెలెక్టర్లు పట్టించుకోలేదు. లీగ్స్​లో రాణించిన వరుణ్​ గౌడ్, రోహిత్​ రాయుడు, అనిరుధ్​ రెడ్డి, అరుణ్​ విట్టల్​, బి. చందు, యష్‌‌పాల్‌‌ కపాడియా వంటి ప్లేయర్లను కాదని.. ఏమాత్రం ఆకట్టుకోని హిమాలయ్‌‌ అగర్వాల్‌‌, భగత్‌‌ వర్మ, బి. అనిరుధ్‌‌, బి. సందీప్‌‌, జె. మల్లికార్జున్‌‌ తదితరులకు చాన్స్‌‌ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఎప్పట్లాగే  టీమ్‌‌ సెలెక్షన్‌‌ను వేలం పాటలా మార్చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ‘తాము చెప్పిన ప్లేయర్లనే ఎంపిక చేయాలని క్లబ్‌‌ సెక్రటరీలు, ఆఫీస్‌‌ బేరర్ల నుంచి సెలెక్టర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలోనూ కొంత మంది అర్హత లేని ఆటగాళ్లు ఆడారు. టీమ్​ ఎంపిక విషయంలో సెలెక్టర్లకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఆ టోర్నీలో మన టీమ్‌‌ పెర్ఫామెన్సే నిదర్శనం. ఇప్పుడు విజయ్‌‌ హజారే ట్రోఫీలోనూ అదే జరుగొచ్చు’ అని ఓ క్లబ్‌‌ సెక్రటరీ అభిప్రాయపడ్డారు.

గత నెలలో జరిగిన ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీలో ఐదింటిలో నాలుగు మ్యాచ్‌‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్‌‌ ఇప్పటికే పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు అసలు ప్లేయర్ల ఆటను చూడని వాళ్లను,  అప్పటికప్పుడు నామినేట్‌‌ చేసిన సెలెక్టర్లతో ఎంపిక చేసిన టీమ్‌‌ నుంచి విజయ్‌‌ హజారే ట్రోపీలో మంచి పెర్ఫామెన్స్‌‌ ఆశించడం అత్యాశే అనొచ్చు.

ఏజీఎం జరగదు.. సీఏసీ ఏర్పాటు కాదు… సెలెక్షన్​ కమిటీ రాదు..

అజరుద్దీన్‌‌ అండ్‌‌ కో పదవిలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. కానీ, రెండు వర్గాలుగా విడిపోయిన అఫీస్‌‌ బేరర్లు అంతర్గత కుమ్ములాటలతో పాలనను గాలికి వదిలేశారు. ఇంతవరకూ ఏజీఎం నిర్వహించలేదు. హెచ్‌‌సీఏకు ఇప్పటిదాకా అంబుడ్స్‌‌మన్‌‌, క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) లేదు. ఆర్‌‌ఏ స్వరూప్‌‌ నేతృత్వంలోని ఐదుగురు సెలెక్టర్ల  కమిటీ పదవీకాలం గత సీజన్‌‌తోనే ముగిసింది. కానీ,  సీఏసీ లేకపోవడంతో కొత్త సెలెక్షన్‌‌ ప్యానెల్‌‌ను నియమించే అవకాశం లేకుండా పోయింది. డిసెంబర్‌‌1వ తేదీన ఏజీఎం ప్లాన్‌‌ చేసినప్పటికీ జీహెచ్‌‌ఎంసీ ఎలక్షన్‌‌ కారణంగా అది వాయిదా పడింది. అప్పటి నుంచి ఏజీఎం కొత్త డేట్స్‌‌ను హెచ్‌‌సీఏ అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ ప్రకటించలేదు. ఏజీఎం విషయంలో హెచ్‌‌సీఏ పెద్దలు కావాలనే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.  సీఏసీని ఏర్పాటు చేస్తే.. అది సెలెక్షన్‌‌ కమిటీని నియమిస్తుంది,  అప్పుడు తాము కోరిన ప్లేయర్లను ఎంచుకునే అవకాశం లేకుండా పోతుందని భావిస్తున్నారట.  ఇక, ఓవైపు తన పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ అజరుద్దీన్‌‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముస్తాక్‌‌ అలీ ట్రోఫీకి ముందు హెచ్‌‌సీఏ లీగ్స్‌‌ను తిరిగి ప్రారంభించే టైమ్‌‌లో నగరంలో లేని అజర్‌‌.. ఇప్పుడు మరో కీలకమైన ట్రోఫీకి ముందు దేశంలోనే లేడు.  అబుదాబిలో జరిగిన టీ10 లీగ్​లో నార్తర్న్‌‌ వారియర్స్‌‌ టీమ్‌‌కు మెంటర్‌‌గా వ్యవహరించారు. ఇండియా మాజీ కెప్టెన్‌‌ మార్గనిర్దేశంలో నార్తర్న్‌‌ వారియర్స్‌‌ ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. కానీ, అజర్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న  హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ మాత్రం విపరీత చేష్టలతో తన పరువును పాతాళానికి దిగజార్చుకుంటోంది.

For More News..

వూహాన్ ల్యాబ్ నుంచి కాదు.. ఆస్ట్రేలియా బీఫ్‌‌‌‌‌‌‌‌ నుంచే కరోనా!

16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ పాపకు అండగా మోదీ

అర ఎకరంతో మొదలుపెట్టి.. 15 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న టెన్త్ డిస్‌కంటిన్యూ స్టూడెంట్