- బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ
- ఒక్కో ఉద్యోగి వద్ద రూ.3 లక్షల వరకు వసూల్
- మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మాదాపూర్, వెలుగు: మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. కావూరి హిల్స్ లోని వీవీ చాంబర్స్ బిల్డింగ్ లో సినార్జీ యూనివర్సల్పేరుతో ఇటీవల కంపెనీ వెలిసింది. బ్యాక్ డోర్లో ఐటీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆఫర్ లెటర్లు ఇచ్చి వర్క్ ఫ్రామ్ హోమ్ చేయాలని ఉద్యోగులకు సూచించింది.
అయితే, జాబ్ లో జాయినై ఆరు నెలల అవుతున్నా జీతాలు ఇవ్వకపోవడంతో.. ఉద్యోగులు అందరూ కలిసి ఆఫీస్‌కు వెళ్లి నిలదీశారు. ప్రాజెక్టులు లేవని అందుకే జీతాలు ఇవ్వడం లేదని మేనేజ్మెంట్ చెప్పడంతో వెనుదిరిగారు. కొద్దిరోజులుగా మేనేజ్మెంట్ ఆఫీస్‌కు రాకపోవడం, ఫోన్ కాల్స్, మెయిల్స్‌కు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీసులను గురువారం ఆశ్రయించారు.
దాదాపు 500 మంది నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి పరిశీలిస్తున్నారు.