ఫారిన్‌‌లో ఉద్యోగమంటూ మోసం

  • పలువురి వద్ద రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం

ఎర్రుపాలెం, వెలుగు : ఫారిన్‌‌ పంపిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి పుల్లారెడ్డి పలువురిని ఫారిన్‌‌ పంపి, పని కల్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో ఏపీలోని ఎన్టీఆర్‌‌ జిల్లా గంపలగూడెం మండలం సత్యాలపాడు గ్రామానికి చెందిన వంగల శ్రీనివాసరావు, చింతల నర్వ గ్రామానికి చెందిన ఎనమద్ది రవితేజ ఫారిన్‌‌ వెళ్లాలన్న ఉద్దేశంతో పుల్లారెడ్డిని కలిశారు.

అతడు ఒక్కొక్కరి వద్ద రూ. 4 లక్షల చొప్పున వసూలు చేశాడు. 2023లో శ్రీనివాసరావును 15 రోజుల విజిటింగ్‌‌ వీసా మీద అల్మేనియాకు పంపించాడు. కానీ అక్కడ పని లేకపోవడంతో శ్రీనివాసరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బంధువుల సాయంతో తిరిగి సొంతూరికి వచ్చాడు. తర్వాత శ్రీనివాసరావు, రవితేజ..

పుల్లారెడ్డిని కలిసి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌‌ చేయడంతో రేపు, మాపంటూ తిప్పుతున్నాడు. దీంతో విసుగు చెందిన వారు గురువారం ఎర్రుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పుల్లారెడ్డి ఇలా మరికొందరిని నమ్మించి రూ. 30 లక్షల వసూలు చేసినట్లు తెలుస్తోంది.