- ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు వసూలు
- ముగ్గురు అరెస్టు..పరారీలో మరో ఇద్దరు
- రూ. 4 లక్షలు, ఇతర డ్యాక్యుమెంట్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు
మల్కాజిగిరి, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడుతున్న నిందితులను ఎల్ బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు కథనం ప్రకారం..సరూర్ నగర్ లో ఉంటూ ప్రైవేట్‌జాబ్ చేసుకునే షేక్ బడే సాహెబ్ అలియాన్ షేక్ మున్నా (30) దిల్సుఖ్నగర్లోఉండే ముత్తోజులక్ష్మణాచారి(24), కొత్తపేట హుడా కాలనీలో ఉండే మడక రామస్వామి(56), బెంగుళూరుకు చెందిన మహ్మద్మాలిక్,పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్ ముఠాగా ఏర్పడ్డారు.
షేక్బడే సాహెబ్ దిల్‌సుఖ్‌నగర్‌లో సూపర్వైజర్గా పని చేస్తూ ఓ వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. 2021లో లక్ష్మణ్ కార్పొరేట్స్, సాఫ్ట్ టెక్ సంస్థలు ఏర్పాటు చేసి కోర్టు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డ్యాక్యుమెంట్లు స్కానింగ్ చేసేవాడు. తర్వాత సీవైఈ టెక్నాలజీస్ పేరుతో ఓ కంపెనీ పెట్టాడు. ఈ క్రమంలో లక్ష్మణాచారి, మడక స్వామి పరిచయమయ్యారు. వీరిద్దరు మున్నా స్థాపించిన సంస్థలో ఏజెంట్లుగా పని చేసేందుకు ఒప్పుకొని నిరుద్యోగులను మోసం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. లక్ష్మణాచారి, స్వామి తెలిసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేసేవారు. బెంగళూరులో ఉండే మహ్మద్ మాలిక్ తో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు, బెంగాల్ కు చెందిన ఆకాశ్ గుర్తింపు కార్డులు తయారు చేసి పంపేవాడు.
దొరికారు ఇలా..
మహబాబాబాద్ కు చెందిన రామచందర్, భూపాలపల్లికి చెందిన సమ్మయ్య, ఘట్ కేసర్ కు చెందిన కాసారపు తిరుపతి స్నేహితులు. వీరు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని చూస్తున్నారు. ఆ టైంలో మందమర్రికి చెందిన మడక స్వామి తన కొడుక్కి దిల్ సుఖ్ నగర్ లోని కంపెనీ ద్వారా జాబ్ వచ్చిందని నమ్మించాడు. దీంతో తిరుపతి తన కూతురి కోసం రూ.12 లక్షలు ఇచ్చాడు. సమ్మయ్య, రామచందర్ కూడా చెరో రూ. 16 లక్షలు చెల్లించారు.
డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో ఆఫీసుకు వెళ్లి నిలదీయగా, నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు ఇప్పించారు. మూడు నెలలు ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి 15 వేల చొప్పున జీతం కూడా ఇచ్చారు. తర్వాత డబ్బులు రాకపోవడంతో ఎంక్వైరీ చేయగా ఫ్రాడ్ అని తేలింది. దీంతో పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజాపాలన టెండర్ల పేరుతో మోసం
రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, పోచారం పోలీసులతో కలిసి జాయింట్ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4 లక్షల క్యాష్, మూడు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్, మూడుసెల్‌ఫోన్లు, నకిలీ అపాయింట్మెంట్లెటర్లు, నకిలీ గుర్తింపు కార్డులు, రబ్బరు స్టాంపులు, నకిలీ ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బెంగళూరుకు చెందిన మాలిక్, ఆకాశ్ కోసం గాలిస్తున్నట్లు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
కాగా మున్నా సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలతో ఉండే లెటర్ప్యాడ్లు తయారు చేసి ప్రజాపాలన టెండర్ల పేరుతో ఫేక్ అగ్రిమెంట్లు కూడా ఇచ్చి బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడని సీపీ వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన భుక్యా రవీంద్రనాయక్‌కు లిక్కర్‌షాపు లైసెన్సుఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకుని నకిలీ అగ్రిమెంట్లెటర్ ఇచ్చాడు. ఇంకా ఎక్కడెక్కడ నేరాలు చేశారన్న దానిపై విచారిస్తున్నామని సీపీ తెలిపారు.