- కుదువపెట్టిన బంగారం, కొత్త బంగారం కోసం
- అప్పు తీసుకొని పరార్
- షాప్ ఎదుట బాధితుల ఆందోళన
యాదగిరిగుట్ట, వెలుగు : కుదువ పెట్టుకున్న పాత బంగారం, కొత్త బంగారం ఇచ్చేందుకు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు ప్రచారం కావడం యాదగిరిగుట్టలో కలకలం రేపింది. రెండు రోజులుగా అతడు కనిపించకపోవడం, ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో బాధితులు షాప్ వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... రాజస్తాన్‌కు చెందిన జితేందర్ సింగ్ రాథోర్ (జిత్తు) పదిహేనేండ్ల కింద యాదగిరిగుట్టకు వలస వచ్చాడు.
మొదట ఓ జ్యుయల్లర్స్‌లో పనిచేసిన జితేందర్ సింగ్ కొన్ని రోజుల తర్వాత జైభవానీ కిరాణ అండ్ జనరల్ స్టోర్ పెట్టాడు. పదేండ్ల కింద ‘జైభవానీ జ్యుయల్లర్స్’ పేరుతో షాప్ ఓపెన్ చేసి బంగారం వ్యాపారం మొదలుపెట్టాడు. కొత్త బంగారం అమ్ముతూనే పాత బంగారం కుదువ పెట్టుకొని అవసరమైన వారికి అప్పులు ఇస్తుండేవాడు. స్థానికుల వద్ద కూడా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే గురువారం నుంచి జితేందర్ సింగ్ షాప్ తీయకపోవడంతో పాటు కనిపించకపోవడం, ఫోన్ సైతం స్విచాఫ్ వస్తుండడంతో అతడు పరారైనట్లు ప్రచారం జరిగింది. దీంతో బంగారం కుదువ పెట్టిన వారు, కొత్త బంగారం కోసం డబ్బులు ఇచ్చిన వారితో పాటు అప్పులు ఇచ్చిన వారు శుక్రవారం జైభవానీ జ్యుయల్లర్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జితేందర్ గతంలో పనిచేసిన దుర్గా జ్యుయల్లర్స్‌ను ముట్టడించి, జితేందర్ జాడ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొందరు షాప్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుర్గా జ్యుయల్లర్స్‌ను మూసివేయించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని చెప్పడంతో వారంతా స్టేషన్‌కు వెళ్లారు. ఇప్పటివరకు సుమారు 25 మంది బాధితులు స్టేషన్‌కు రాగా, జితేందర్ రూ. 5 కోట్లతో ఉడాయించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేశ్ చెప్పారు.