విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం.. 13 మంది నుంచి  65 లక్షలు వసూలు

  • విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం
  • నెలకు రూ.5 లక్షల  జీతమంటూ ట్రాప్
  • 13 మంది నుంచి  65 లక్షలు వసూలు
  • పోలీసులను  ఆశ్రయించిన బాధితులు

బషీర్ బాగ్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో సిటీకి చెందిన నిరుద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడగా.. బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలో ఉండే ప్రశాంత్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి కొంతకాలం కిందట అభిరామ్‌‌ అనే వ్యక్తితో ఆన్ లైన్​లో పరిచయం ఏర్పడింది. తాను 'మాస్క్‌‌' షిప్పింగ్‌‌ కంపెనీలో పని చేస్తానని.. ఎంతో మందికి అందులో ఉద్యోగాలు ఇప్పించానని ప్రశాంత్​కు అభిరామ్ చెప్పాడు.

సింగపూర్, మలేషియా, థాయ్ లాండ్, మాల్దీవ్స్​లో పనిచేసేందుకు తనకు డాక్యుమెంట్ ఎక్స్​పర్ట్స్ కావాలని.. ఒక్కొక్కరికి నెలకు రూ.5 లక్షల జీతం ఇస్తానని అభిరామ్ తెలిపాడు. రెండ్రోజుల తర్వాత ప్రశాంత్​కు కాల్ చేసిన అభిరామ్.. సింగపూర్​కు షిప్ వచ్చిందని తనకు 20 మంది ఎక్స్​పర్ట్​లు కావాలని కోరాడు. ఈ మాటలు నమ్మిన ప్రశాంత్ మరో 12 మందిని జత కలుపుకున్నాడు. పాస్ పోర్టు, వీసా, ఇన్సూరెన్స్ చార్జీల పేరుతో ప్రశాంత్​తో పాటు మిగతా 12 మంది నుంచి  రూ.5 లక్షల చొప్పున రూ.65 లక్షలను అభిరామ్ వసూలు చేశాడు.

 డబ్బు తీసుకుని 15 రోజులు గడిచినా అభిరామ్‌‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో బాధితులు ‘మాస్క్’ కంపెనీలో ఆరా తీశారు. తమ కంపెనీలో అభిరామ్ పేరుతో ఎంప్లాయ్ ఎవరూ లేరని సదరు కంపెనీ తెలిపింది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న 13 మంది బాధితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.