హసన్ పర్తి,వెలుగు: జేఎన్టీయూలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి రూ.48 లక్షలు వసులు చేసిన ఘరానా మోసగాడిని సోమవారం హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ సీఐ ముసుగు అబ్బయ్య కథనం ప్రకారం ..సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన శివానాథుని రాజేశ్ ప్రస్తుతం గోపాలపురంలో ఉంటున్నాడు.
ఇతడు జేఎన్టీయూలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి గోపాలపూర్‌కు చెందిన మాతంగి సురేందర్ తో పాటు మరో 24మంది దగ్గర రెండేండ్ల కింద రూ.48 లక్షలు వసూలు చేశాడు. అప్పటి నుంచి మాయమాటలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన రాజేశ్‌ను అరెస్ట్‌చేశారు. అతడి నుంచి ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు.