వనపర్తి, వెలుగు : లోన్ పేరుతో మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వనపర్తి సైబర్ క్రైం డీఎస్పీ ఎన్‌బి.రత్నం చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.
గోపాల్‌పేట మండలం పొలికేపాడు గ్రామానికి చెందిన కావలి శివుడికి ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తనకు ‘ధని’ లోన్ సర్వీసెస్ నుంచి లోన్ మంజూరు అయిందని, ఈ డబ్బులను అకౌంట్‌లో వేసేందుకు ఇన్సూరెన్స్, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజును ముందుగానే చెల్లించాలని చెప్పారు. దీంతో శివుడు గతేడాది నవంబర్ 29న పలు దఫాలుగా రూ. 32,135లను గుర్తు తెలియని వ్యక్తి సూచించిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అయినా ఇంకా డబ్బులు వేయాలని అడుగుతుండడంతో అనుమానం వచ్చిన శివుడు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఆఫీసర్లు ఎంక్వైరీ చేయగా ఈ దందాలో మొత్తం 55 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో శివుడిని మోసం చేసిన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన సూర్తితండాకు చెందిన ముదావత్ నరేశ్‌నాయక్, వెంకటేశ్‌నాయక్, చందూనాయక్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన కారు, జేసీబీ, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సైబర్ క్రైం ఎస్సై రవిప్రకాశ్, వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాలపేట ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.