
లైకా బిట్ కాయిన్.. అసలు ఇలాంటి కాయిన్ అనేదే లేదు.. అయినా ఆ కేటుగాళ్లు లైకా బిట్ కాయిన్ పేరుతో బ్రోచర్లు వేశారు.. గ్రామాల్లో పంచారు.. 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. 30 వేలు వస్తాయి.. అది కూడా జస్ట్ ఏడాదిలోనే అంటూ నమ్మించారు.. ఇంకేముందీ ముందూ వెనకా చూడకుండా ఎగబడి పెట్టుబడులు పెట్టేశారు.. తీరా పెట్టుబడికి లాభాలు ఏవీ అని ప్రశ్నించే సరికి.. పత్తా లేకుండా పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ సిటీ శివార్లలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు కేటుగాళ్లు.. లైకా బిట్ కాయిన్ పేరుతో ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. దీనికితోడు లైకా బిట్ కాయిన్ పేరుతో బ్రోచర్లు ముద్రించారు. వీటిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. ఏడాదిలోనే 30 వేల రూపాయలు వస్తాయని నమ్మించారు. లైకా బిట్ కాయిన్ మంచి లాభాలు ఇస్తుందని నమ్మిన శ్రీరంగం, వీరేంద్ర, బ్రహ్మచారిలు వేలకు వేలు పెట్టుబడి పెట్టారు. ఏడాది గడిచినా పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వకపోవటంతో.. మోసపోయాం అని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
శ్రీరంగం, వీరేంద్ర, బ్రహ్మచారిలు 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వీళ్లే కాకుండా ఇంకా పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారు ఎంతో మంది ఉన్నారని చెబుతున్నారు వీళ్లు. మేం 11 లక్షలు పెట్టాం.. రూపాయి కూడా రాలేదు అంటున్నారు. ఇక 10 వేలు, 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినోళ్లు వందలు, వేల మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం లైకా బిట్ కాయిన్ వెబ్ సైట్ కూడా పని చేయటం లేదని.. దాన్ని మూసివేశారని.. మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ కీసర పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు వీరు.
►ALSO READ | కేజీ బంగారం దొంగలు ఇంట్లో పని మనుషులే.. కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పురోగతి
లైకా బిట్ కాయిన్ కేటుగాళ్లను పట్టుకుని.. మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుతున్నారు ఈ బాధితులు. చాలా మంది పేదలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారని.. ఇప్పుడు వాళ్లు ఎవరూ కనిపించటం లేదని.. వాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయటం లేదంటున్నారు బాధితులు. లైకా బిట్ కాయిన్ పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు.