- గల్ఫ్ఏజెంట్ఇంటి ముందు బాధితుల ధర్నా
మెట్ పల్లి, వెలుగు : దుబాయ్‌లో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నకిలీ వీసాలు ఇప్పించిన ఏజెంట్ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి టౌన్‌లోని చైతన్య నగర్‌కు చెందిన గల్ఫ్ ఏజెంట్ ఏలేటి రమేశ్ దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, జీతం రూ.49 వేలని పలువురిని నమ్మించాడు. నిరుడు అక్టోబర్‌లో నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన 60 మంది నుంచి రూ.60 వేల చొప్పున తీసుకొని నకిలీ వీసాలు ఇప్పించాడు.
ఆ వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు వారు ఈనెల 25న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు చెక్‌చేసి వీసాలు నకిలీవని గుర్తించి 58 మందిని వెనక్కి పంపారు. మరో ఇద్దరు దుబాయ్ వెళ్లగా అక్కడి అధికారులు గుర్తించి వెనక్కి పంపించడంతో శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మెట్‌పల్లిలోని ఏజెంట్ ఇంటి ముందు ఆందోళన చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, తమను మోసం చేసిన రమేశ్‌పై చర్యలు తీసుకోవాని డిమాండ్‌చేశారు.