- హిజ్రాతో పాటు ఐదుగురు అరెస్ట్
జనగామ అర్బన్, వెలుగు: శాంతిపూజలు చేసి దోషాలు తొలగిస్తానని మోసం చేసిన కేసులో హిజ్రాతో పాటు నలుగురు యువకులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ వెల్లడించారు. బట్టు నాగదేవి అనే ట్రాన్స్‌జెండర్ మూడేండ్ల కింద జనగామలోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలో నివాసముండేది. రెండేండ్ల కింద సందీప్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. బిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దోష నివారణ పూజల పేరుతో ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టింది. ఇటీవల వెంకన్నకుంటకు చెందిన ఉప్పల సిరివెన్నెల వద్ద శాంతి పూజల పేరుతో పలుమార్లు రూ.55 లక్షలు తీసుకుంది. దీంతో ఆమె జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు.
శనివారం నెహ్రూ పార్క్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ కారులో నలుగురు యువకులతో కలిసి వస్తున్న నాగదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగదేవితో పాటు సందీప్, మెతుకు గణేశ్, నవీన్, భుక్యా గణేశ్‌ను అరెస్ట్ చేసి ఎర్టిగా కారు, 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాముల బంగారానికి సంబంధించిన ముత్తూట్ ఫైనాన్స్ డిపాజిట్ స్లిప్, రెండు ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఏసీపీ పార్థసారథి, సీఐ దామోదర్ రెడ్డి, కానిస్టేబుళ్లు రామకృష్ణ, రేణుక పాల్గొన్నారు.