
బషీర్ బాగ్, - వెలుగు: లోన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఓ సైబర్ చీటర్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రాజస్థాన్ భరత్ పూర్ ఉబాక గ్రామానికి చెందిన శైకుల్ ఖాన్ కాల్ సెంటర్ నిర్వహిస్తూ లోన్లు ఇప్పిస్తానంటూ ఆన్లైన్లో పలువురిని టార్గెట్ చేసేవాడు. ఇటీవల హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తికి బిజినెస్ లోన్ ఇప్పిస్తానని పరిచయం అయ్యాడు. అతడి నుంచి వివిధ చార్జీల పేరుతో రూ.60 లక్షలు కాజేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్ లో శైకుల్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. పని చేస్తున్న ఇద్దరు పరారయ్యారు. నిందితుడు శైకుల్ ఖాన్ ను హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.