
- ముఠా గుట్టురట్టు చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్, నర్సంపేట పోలీసులు
- ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మంగళంపల్లి వీరయ్య ప్రభుత్వ ఉద్యోగి కాగా.. విశాఖపట్నానికి చెందిన కొరిబిల్లి ఉపేంద్ర, తూర్పుగోదావరి జిల్లా ధర్మవరానికి చెందిన గంటి గౌతమ్ అనే జాబ్ కన్సల్టెన్సీ నడిపే వ్యక్తులతో అతడికి పరిచయం ఏర్పడింది. వీరికి నర్సంపేట శాంతినగర్ కు చెందిన రాయపర్తి రమేశ్, రాయపర్తి వెంకటేశ్వర్లు పరిచయం అయ్యారు. అందరూ కలిసి ఉద్యోగాల పేరున మోసాలకు తెరదీశారు. రైల్వే డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.32 లక్షలకుపైగా వసూలు చేశారు. ఆ డబ్బంతా భూములపై ఇన్వెస్ట్ చేసి జల్సాలకు ఖర్చు చేశారు. కాగా ఉద్యోగాల కోసం రోజుల తరబడి తిప్పిస్తుండడంతో కొంతమంది బాధితులు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు మంగళంపల్లి వీరయ్య, కొరిబిల్లి ఉపేంద్, గంటి గౌతమ్‌ను అరెస్ట్ చేశారు.
నకిలీ కాల్ లెటర్స్, నకిలీ శాలరీ స్లిప్స్, రూ.3 లక్షల నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా నర్సంపేటకు చెందిన రాయపర్తి రమేశ్, ఆయన కొడుకు వెంకటేశ్వర్లు, కూతురు సంతోషిమాత, భార్య పుష్పలత పరారీలో ఉన్నారు. కాగా అదుపులోకి తీసుకున్న నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం నర్సంపేట పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ సీఐలు కె. శ్రీనివాసరావు, కె.జనార్దన్ రెడ్డి, ఎ. రాంబాబు, ఎస్సైలు పెండ్యాల దేవేందర్, బి.శరత్ కుమార్, వి.లవన్ కుమార్, డి.రాజు, ఏఏవో సల్మాన్ పాషా, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.