మంథని, వెలుగు : నకిలీ ఫేక్ ఫోన్ పే యాప్ తో ఆన్‌లైన్ సేవా కేంద్రంలో డబ్బులు తీసుకొని ఓ యువకుడు మోసం చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. కాల్వశ్రీరాంపూర్ మండలం ఉషనపల్లికి చెందిన రాజ్‌కుమార్ ఆదివారం మంథని పట్టణంలోని త్రినేత్రి ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లాడు. అతడు తన ఫేక్ ఫోన్‌పే యాప్‌తో షాప్‌లో ఉన్న స్కాన్ చేసి రూ.300 పంపినట్లు చూపించి, షాప్ ఓనర్ సాయి దగ్గర ఆ డబ్బును తీసుకెళ్లాడు.
సాయంత్రం వరకు చూసినా సాయి అకౌంట్‌లో నగదు జమకాలేదు. తిరిగి సోమవారం రాజ్‌కుమార్ అదే షాప్‌కు వెళ్లి రూ.500 స్కాన్ చేశాడు. అతడిని గుర్తించిన షాప్ ఓనర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు యువకుడి ఫోన్ తీసుకొని చెక్‌చేయగా అది ఫేక్ యాప్ అని తేలడంతో స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేయగా పెద్దపల్లిలోని తన ఫ్రెండ్ ఈ లింక్ పంపినట్లు చెప్పాడు.