బ్యాంక్​ లోన్లు మాఫీ చేయిస్తానని రూ.లక్షల వసూలు..మోసగాడి అరెస్టు

​నిజామాబాద్​, వెలుగు: తనకు చాలామంది ప్రముఖులతో పరిచయాలున్నాయని, వాటి ద్వారా తీసుకున్న లోన్లు  మాఫీ చేయిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన కేటుగాడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వన్​ టౌన్​ సీఐ రఘుపతి వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్​కు చెందిన బంగారు అప్పారావు లగ్జరీకారులో తిరుగుతూ డాక్టర్లతో పరిచయం పెంచుకున్నాడు. ప్రముఖుల సిఫారసుతో లోన్లు మాఫీ చేయించొచ్చని ఇందుకు కొంత ఖర్చు చేస్తేచాలని నమ్మించాడు.

నగరంలోని ఒక డాక్టర్ రూ.50 లక్షల బ్యాంక్​ లోన్​ మాఫీ చేయిస్తానని  రూ.15 లక్షలు తీసుకున్నాడు. మోర్తాడ్​లోని మరో డాక్టర్​ నుంచి రూ.12 లక్షలు, జగిత్యాల జిల్లా కోరుట్ల డాక్టర్​ తీసుకున్న రూ.2 కోట్ల లోన్​ మాఫీ చేయిస్తానని  ఏకంగా రూ.60 లక్షలు సెటిల్మెంట్​ కింద తీసుకున్నాడు. ఇలా చాలా మందిని బురడీ కొట్టించి రూ.కోట్లు పోగుచేసి రియల్​ ఎస్టేట్​ రంగంలో పెట్టుబడిగా పెట్టాడు.  రూ.లక్షలు నష్టపోయిన డాక్టర్లు  పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కుత్బుల్లాపూర్​ వెళ్లి అతన్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు. నిందితుడు బంగారు అప్పారావును అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని సీఐ రఘుపతి తెలిపారు.