కేశవ స్కూల్లో అనాధ పిల్లలకు ఫ్రీ అడ్మిషన్

కేశవ స్కూల్లో అనాధ పిల్లలకు ఫ్రీ అడ్మిషన్

హైదరాబాద్: నారాయణగూడలోని కేశవ మెమోరియల్ స్కూల్ అనాధ బాలబాలికలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారిలో అనాధలైన బాల బాలికలకు మంచి భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ‘‘ఆపన్న హస్తం’’ పథకం ద్వారా ఉచిత విద్య అవకాశం కల్పిస్తున్నామని స్కూల్ సొసైటీ కార్యదర్శి అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైనంత సహాయం చేయడం మానవతా లక్షణం అని, ఈ సామాజిక బాధ్యతతోనే కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామని ఆయన పేర్కొన్నారు. 
విద్య ద్వారా సమాజానికి సేవ అనేది తమ విద్యా సంస్థ ప్రధాన ఉద్దేశమని, అందుకే కరోనాతో అనాథలుగా మిగిలిన బాల బాలికలకు ఉచిత విద్య అందిస్తున్నామని ఆయన వివరించారు. బాధిత కుటుంబాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అడ్మిషన్ తదితర వివరాలకు స్కూల్ పనివేళల్లో సంప్రదించాలని ఆయన కోరారు.