
హైదరాబాద్: బర్డ్ ఫ్లూపై అపోహను తొలగించాలని చికెన్ వ్యాపారులు చికెన్ ఐటమ్స్తో ప్రీ ఫుడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం హయత్ నగర్లోని వెన్ కాబ్ వెంకటేశ్వరా హేచరీస్ కంపెనీ, జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు మహేష్ ఆధ్వర్యంలో కుంట్లూర్ మెయిన్ రోడ్లో మెగా చికెన్ మేళా నిర్వహించారు.
చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చిల్లీ చికెన్, బాయిల్డ్ ఎగ్స్తో ఫెస్ట్ నిర్వహించి ఉచితంగా పంపిణీ చేయడంతో చికెన్ ఐటమ్స్ తినేందుకు జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా అందిస్తున్న చికెన్ ఐటమ్స్ ప్రజలు ఆవురావురమంటూ లాగించేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలను నమ్మవద్దని చెప్పారు. చికెన్ వండే సమయంలో బాగా ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులు రావని అన్నారు. ప్రజల్లో ఉన్న అపోహను తొలగించేందుకే ఈ చికెన్ ఫెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు.
70 డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్ను బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు.
బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ, మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చికెన్ మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.