
- ఇంటర్ విద్యార్థులకు ఆరు నెలలుగా శిక్షణ ఇప్పించిన ఎమ్మెల్యే యెన్నం
- పూర్తయిన క్లాసులు, 29 నుంచి ఎంట్రెన్స్
- ఫ్రీ కోచింగ్ తో 200 మంది స్టూడెంట్లకు లబ్ధి
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో విద్యాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివేలా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ బాయ్స్, గర్ల్స్ కాలేజీల్లో నీట్, ఐఐటీలో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్లకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించారు. గత నెలలోనే కోచింగ్ పూర్తయినప్పటికీ, పోటీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలనే టార్గెట్‌తో 45 రోజుల క్రాష్ కోర్సును గత నెల 22 నుంచి ప్రారంభించారు. ఈ నెల 26 వరకు ఈ కోర్సు పూర్తి చేయించారు. కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్తా చాటుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
లాంగ్ టర్మ్ కోచింగ్..
పాలమూరులోని ప్రభుత్వ బాయ్స్, గర్ల్స్ జూనియర్ కాలేజీల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జడ్చర్ల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఖిల్లాఘణపురం తదితర ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఎంపీసీ, బైపీసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఉన్నారు. వీరిలో ఎంసెట్ రాసేందుకు 200 మంది ఇంట్రెస్ట్ చూపారు. వీరంతా వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీల కుటుంబాలు కావడంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వీరికి ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు.
ఈ కోచింగ్‌ను గత ఏడాది ఆగస్టు 22న ప్రారంభించగా.. స్థానిక రిషి, ప్రతిభ జూనియర్ కాలేజీలకు చెందిన ఫ్యాకల్టీతో బాలురు, బాలికలకు వేర్వేరుగా క్లాసులు చెప్పించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ తదితర సబ్జెక్టుల్లో కంప్లీట్ చేసిన సిలబస్‌పై ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు నిర్వహించారు. కోచింగ్ తీసుకున్న వారికి రూ.8 వేల మెటీరియల్‌ను ఫ్రీగా అందించారు.
45 రోజుల క్ర్యాష్ కోర్సు..
ఎంసెట్ కోచింగ్ పూర్తయిన తరువాత స్టూడెంట్లు ఇంటర్ పరీక్షలు రాశారు. అయితే ఇండ్లకు వెళ్తే సబ్జెక్ట్ మరిచిపోతారనే ఆలోచనతో ఎమ్మెల్యే వీరికి 45 రోజుల క్రాష్ కోచింగ్ ఇప్పించారు. ఈ కోచింగ్ గత నెల 22న ప్రారంభించారు. 110 మంది ఈ కోచింగ్ తీసుకున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్లు స్థానికేతరులు కావడంతో 30 మంది బాయ్స్‌కు స్థానిక షాషబ్ గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో, 70 మంది బాలికలకు స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఉన్న బీసీ హాస్టల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు హాస్టల్స్‌లో హాలిడేస్ ఉండడంతో ఎమ్మెల్యే తన నిధులు సమకూర్చి స్టూడెంట్లకు భోజనం సమకూర్చారు. స్టూడెంట్లతో చదివించేందుకు గర్ల్స్ కాలేజీకి చెందిన కవిత, నరేశ్, బాయ్స్ కాలేజీకి చెందిన శశికళ, రవిని కేర్ టేకర్లుగా ఏర్పాటు చేశారు.
వారికి సెలవులు ఉన్నా ఎమ్మెల్యే రిక్వెస్ట్‌తో డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి వారం ఈ సెంటర్‌ను ఎమ్మెల్యే విజిట్ చేసి స్టూడెంట్లకు మోటివేషన్ క్లాసులు ఇస్తూ వారిలో ధైర్యం నింపారు. శనివారం ఈ కోచింగ్ పూర్తయింది. పూర్తయిన సిలబస్‌పై స్థానిక జేపీఎన్సీఈ కాలేజీలో మధ్యాహ్నం మాక్ టెస్ట్ నిర్వహించారు. ఈ సెంటర్‌ను ఎమ్మెల్యే విజిట్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
పాలమూరు పేరు నిలబెట్టాలె..
పాలమూరు జిల్లాలోని ప్రతి నిరుపేదకు ఉన్నత విద్యను అందించాలన్నదే నా తపన. చాలా మంది పిల్లలకు ఎంసెట్ రాయాలనే కోరిక ఉన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక దూరంగా ఉంటున్నారు. గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న వారిని ఎంపిక చేసి ఫ్రీ కోచింగ్ క్లాసులు చెప్పించా. ఎంసెట్‌లో ర్యాంకులు సాధిస్తారనే నమ్మకం ఉంది. రిజల్ట్స్‌లో పాలమూరు పేరు నిలబెడితే అంతకన్నా ఆనందం ఏం ఉంటుంది.- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే
ఎంసెట్ రాయకపోతుంటి..
మా నాన్న కేశవులు. రోజు వారి కూలీ. ఆయన పనికి పోయి వస్తేనే మా ఇంట్లో అందరం తింటాం. అలాంటిది నేను ప్రైవేట్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకోవడం సాధ్యమయ్యది కాదు. ఎమ్మెల్యే సార్ మా కలలను సాకారం చేశారు. ఎంట్రెన్స్‌లో ర్యాంక్ సాధిస్తా.- వనజ, బైనల్లీపూర్తె
తెలుగు, ఇంగ్లీష్‌లో క్లాసులు..
మా నాన్న ఖదీర్. ఆయన రైతు. ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ సాధించాలని ఉన్నా, ప్రైవేట్‌లో కోచింగ్ తీసుకోవాలంటే రూ.లక్ష వరకు ఫీజ్ ఉంది. ఎమ్మెల్యే యెన్నం సార్ ఏర్పాటు చేసిన ఎంసెట్ ఫ్రీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యా. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో క్లాసులు చెప్పారు. డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని అడిగి క్లియర్ చేసుకున్నాను. - ముబషీర్, ఖిల్లాఘణపురం, వనపర్తి జిల్లా