ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఎస్సై, కానిస్టేబుల్​ అభ్యర్థులు వినియోగించుకోవాలి  
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు  

మంచిర్యాల, వెలుగు:  సేవా భారతి, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని కాలేజ్ రోడ్​లో గల ఏకలవ్య ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 200 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. రఘునాథ్​రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అయ్యే పేద యువతీ యువకులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్​ కోసం మంచిర్యాల, లక్సెట్టిపేటలో రెండు నెలల పాటు ఫ్రీ కోచింగ్​ ఇచ్చామన్నారు. ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ కోసం కూడా ఉచితంగా శిక్షణ ప్రారంభించామని చెప్పారు. రోజూ పొద్దుట 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏకలవ్య ఆశ్రమం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మల్రాజ్ ఆనంద్​రావు, రంగు శ్రీనివాస్, గాజుల ప్రభాకర్ పాల్గొన్నారు.  

తోలుబొమ్మలాట విజేతలకు డీఈవో సన్మానం 

మంచిర్యాల, వెలుగు:  కళోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తోలుబొమ్మలాటలో రాష్ర్టస్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయిఓ పాల్గొన్న విద్యార్థులను డీఈవో ఎస్​.వెంకటేశ్వర్లు మంగళవారం ఇంటర్నేషనల్​ గర్ల్​ చైల్డ్​ డే సందర్భంగా సన్మానించారు. ముత్యంపల్లి జడ్పీహెచ్​ఎస్​కు చెందిన ఎన్​.బిందుప్రియ, కె.అర్షిత, తాండూర్​ కేజీబీవీకి చెందిన బి.కావ్య 'కరోనాకు మందు లేదు – నివారణే మార్గం' అనే అంశంపై తోలుబొమ్మలాటను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. గైడ్ టీచర్స్ బి.శాంకరి, సుమన, సెక్టోరల్ ఆఫీసర్​ పద్మజ పాల్గొన్నారు.  

17న సైన్స్​ డ్రామా, జానపద నృత్య పోటీలు.....  

జడ్పీ బాయ్స్​ హైస్కూల్​లోని జిల్లా సైన్స్​ సెంటర్​లో ఈ నెల 17న ఉదయం 9గంటల నుంచి జిల్లా స్థాయి సైన్స్​ డ్రామా, జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో ఎస్​.వెంకటేశ్వర్లు తెలిపారు. సైన్స్​ డ్రామా వివరాలకు జిల్లా సైన్స్​ ఆఫీసర్ మధుబాబు ( 9849550200)ను, జానపద నృత్య పోటీల వివరాలకు సెక్టోరియల్​ ఆఫీసర్​ చౌదరి (8328363596)ని సంప్రదించాలని సూచించారు.

హైకోర్టులో ఏజీపీగా అంజలిదేవి 

మంచిర్యాల, వెలుగు: దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వొకేట్​ అంజలీదేవిని ప్రభుత్వం హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)​గా నియమించింది. ఆమె మూడేండ్ల పాటు ఏజీపీగా కొన‌‌‌‌సాగ‌‌‌‌నున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసిన అంజ‌‌‌‌లీదేవి హైకోర్టు లాయర్​గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె భ‌‌‌‌ర్త తిరుప‌‌‌‌తివ‌‌‌‌ర్మ సైతం హైకోర్టులో అడ్వొకేట్​గా కొనసాగుతున్నారు. ఆయన 2001 నుంచి టీఆర్ఎస్​లో కొనసాగుతూ తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్​గా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ లీగల్ సెల్ లీడర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

జర్నలిస్టులకు రైల్వే పాస్​లు ఇవ్వాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా రాయితీ రైల్వే పాస్​లు మంజూరు చేసేలా చూడాలని టీడబ్ల్యూజేఎఫ్​ లీడర్లు ఎంపీ సోయం బాపూరావును కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు వినతి పత్రం అందజేశారు. గతంలో 50 శాతం రాయితీపై పాస్​అందజేసేవారని, కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం దానిని ఎత్తేసిందన్నారు. టోల్​టాక్స్ మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో  టీడబ్ల్యూజేఎఫ్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెడపట్ల సురేశ్, షేక్ మోయిజ్, ఉపాధ్యక్షులు రొడ్డ దేవీదాస్, పసుపుల స్వామి, జర్నలిస్టులు రాగం సుభాష్, సంద సురేశ్, అవునురి దత్తాత్రి, సీడం రవి, నీలేశ్, గాజరి శ్రీకాంత్ తదితరులు 
పాల్గొన్నారు.

కేంద్ర పథకాలపై రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తోంది

ఆదిలాబాద్,వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ తో పాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరయ్యారు. వ్యవసాయం, వైద్యం, మున్సిపాలిటీల, ఐసీడీఎస్​, డీఆర్డీవో, పంచాయతీరాజ్, తదితర శాఖలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలు పెరుగుతున్నాయని, మాస్టర్ ప్లాన్ లో తప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారని కలెక్టర్ ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు నిమిషాలు చర్చించారని, కనీసం డాక్టర్లను నియమించకపోవడంతో కేంద్రం లక్ష్యం నీరుగారుతోంని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఫైర్​అయ్యారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయారని, వారికి పరిహారం ఇప్పించాలని కోరారు. రిమ్స్ హాస్పిటల్ లో సరిపడ అంబులెన్స్ లు లేక ప్రైవేట్ అంబులెన్స్ లను ఆశ్రయిస్తున్నారని కమిటీ సభ్యులు తెలియజేశారు. కొంత మంది డ్యూటీ డాక్టర్లను ఇంటి నుంచి వచ్చేందుకు ఉన్న ఒక్క అంబులెన్స్ వాడుతున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పీహెచ్​సీల్లో డాక్టర్లు, పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చాలన్నారు. బంగారుగూడలో ఇంటి నంబర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, బీజేపీ కౌన్సిలర్ ఉన్నారనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. ప్రజలకు సేవలందించడంపై నిర్లక్ష్యం చేయడం సరికాదని ఎంపీ హెచ్చరించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​సిక్తాపట్నాయక్​తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, డీఆర్డీవో కిషన్ తదితరులు ఉన్నారు. 

త్వరలో పునరావాసం కల్పిస్తాం

కడెం,వెలుగు: కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్​పరిధిలోని గిరిజనులకు త్వరలో పునరావాసం కల్పిస్తామని నిర్మల్ డీఎఫ్ వో సునీల్ చెప్పారు. మంగళవారం ఆయన కడెం మండలం  కొత్త మద్దిపడగ, పెత్తరపు గ్రామాల్లో పునరావాసం కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. బ్యాంక్ అకౌంట్​లేని గిరిజనులు అకౌంట్లు తీయాలన్నారు. ఆయన వెంట ఎఫ్​డీవో కోటేశ్వరరావు, ఎఫ్ఆర్ ఓ అనీత, డీఆర్​వో వాణి, ప్రకాశ్​తదితరులు ఉన్నారు.

క్యాంటీన్​ సేవలు అందుతలేవు

రామకృష్ణాపూర్,వెలుగు: మందమర్రి ఏరియా ఆర్కేపీ సింగరేణి సీహెచ్​పీపై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం  బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రతినిధులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగితెలుసుకున్నారు. అనంతరం లీడర్లు మాట్లాడుతూ... సీహెచ్​పీ ఉద్యోగులకు కనీస సౌలత్​లు కల్పించడంలో సింగరేణి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఉద్యోగులపై పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. కార్యకక్రమంలో ఐఎన్టీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్​ బ్రాంచి వైస్​ ప్రెసిడెంట్లు దేవి భూమయ్య, తేజావత్ రాంబాబు, ఏరియా సెక్రటరీ  దొరిశెట్టి చంద్రశేఖర్, పిట్ సెక్రటరీ శనిగరపు రాములు, ప్రభాకర్, నర్సయ్య, తిరుపతి, సురేశ్, శంకర్, గట్టయ్య, శ్రీనివాస్​, ఎస్​కే ముస్తఫా పాల్గొన్నారు. 

ఆర్కే1ఏ గని బంద్​ చేస్తే కార్మికులకు నష్టం 

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా ఆర్కే-1ఏ బొగ్గు గనిలో 10 ఏళ్లకు సరిపడ బొగ్గు నిల్వలున్నా... యాజమాన్యం గని మూసివేయాలని నిర్ణయించడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్​ ఎండీ. అక్బర్​అలీ విమర్శించారు. మంగళవారం ఆర్కేపీ సీహెచ్​పీ ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆర్కే1ఏ గనిలోని మూడో సీం పనిస్థలంలో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. గనిలో టన్ను బొగ్గు వెలికితీతకు రూ.8 వేలు ఖర్చు చేస్తున్నామని ఆఫీసర్లు పేర్కొంటున్నారని, అయితే మార్కెట్​లో  ఈ-యాక్షన్​లో ద్వారా  టన్నుకు రూ.14,200 విక్రయిస్తున్నారని తెలిపారు. గుర్తింపు, ప్రాతనిథ్య సంఘాలతో సంప్రదించకుండా ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా రిపోర్ట్ తయారు చేసి హడావుడిగా గని మూసివేసే చర్యలు చేపట్టారని ఆరోపించారు. కాంట్రాక్ట్​ కార్మికులకు మెరుగైన ఒప్పందాలకు కృషి చేసిన జాతీయ సంఘాలపై కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నూతనంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అక్బర్​అలీని ఎంప్లాయీస్​ సన్మానించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సంజీవ్​, బ్రాంచి వైస్​ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, కమిటీ సభ్యులు గోనె రాములు, శ్రీధర్​, శ్రీనివాస్​, దూట భాస్కర్​, ఆవుల మల్లమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు. 

హత్య చేసిన వారిని శిక్షించాలి

బెల్లంపల్లి,వెలుగు: హంతకులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ మంగళవారం రాత్రి గ్రామానికి వచ్చిన పోలీసుల వెహికల్​ను అడ్డుకొని భార్యాభర్తలు నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మండలం పెద్దదుబ్బ గ్రామానికి చెందిన పందుల శ్రీనివాస్, ఆయన భార్య పందుల లక్ష్మి దాదాపు రెండు గంటల పాటు తాళ్లగురిజాల పోలీసుల వాహనం ఎదుట ధర్నా చేశారు. తమ కొడుకు పందుల రామకృష్ణను ఈ ఏడాది జూన్ 22న పత్తి చేనులోకి పిలిచి బండారి వంశీ కృష్ణ, ఓనర్ ముక్కెర రామకృష్ణ ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారని ఆరోపించారు. తాళ్లగురిజాల ఎస్సై హంతకులతో కుమ్మక్కై కేసును పక్కదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ పొట్లపల్లి శుభాశ్​రావు, బుచ్చయ్యపల్లి సర్పంచ్ భర్త పొలవేని శ్రీనివాస్ హంతకులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దంపతుల నిరసనకు గ్రామస్తులు మద్దతు పలికారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఇచ్చోడ,వెలుగు: బతుకమ్మను నీటిలో వేసేందుకు వెళ్తున్న కల్లూరి గంగారం(39) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..ఇచ్చోడ మండల  కేంద్రానికి చెందిన గంగారాం మంగళవారం స్థానిక చర్చి సమీపంలోని కాల్వలో బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను 108లో రిమ్స్ హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. 

తీర్మానాలు అమలు చేయని సమావేశాలు ఎందుకు?

లోకేశ్వరం,వెలుగు: తీర్మానాలు అమలు చేయని మండల సమావేశాలు ఎందుకని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లోకేశ్వరం ఎంపీడీవో ఆఫీస్​లో ఎంపీపీ బాయమొళ్ల లలిత అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరు సరిగా లేదని సభ్యులు మండిపడ్డారు. రోడ్లన్నీ నాసిరకంగా వేస్తున్నారని, ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాకాలంలో రోడ్లన్నీ కోతకు గురయ్యాయని, వీటి మరమ్మతులకు గతంలో తీర్మానించగా ఆఫీసర్లు పట్టించుకోలేదన్నారు. కన్కపూర్​లో బతుకమ్మ చీరలు పంపిణీ కాలేదని సర్పంచ్​ నరేశ్​ తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో దేవేందర్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​ రత్నాకర్​రావు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు  తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధిచెబుతారు

నిర్మల్,వెలుగు: టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలం వైకుంఠపురం గ్రామంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్​విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలంతా రెడీ అవుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ లీడర్లు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, విలాస్, నాయుడి మురళీధర్, శేఖర్, వినోద్, శివన్న, జంగిటి రవి, అర్వింద్, భూమేశ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

క్లాత్​బ్యాగుల పంపిణీ

భైంసా,వెలుగు: ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటే లక్ష్యమని కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ చెప్పారు. మంగళవారం మండలంలోని ఇలేగాం గ్రామంలో క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్​వాడకాన్ని నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు మహేశ్, సుదర్శన్, విలాస్  పాల్గొన్నారు.

బాలికల హక్కులను కాపాడాలి

మంచిర్యాల, వెలుగు: ఎలాంటి వివక్ష లేకుండా బాలికల హక్కులను కాపాడడంతో పాటు వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్​ భారతి హోళికేరి అన్నారు. ఇంటర్నేషనల్​ గర్ల్​ చైల్డ్​ డేను మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించారు. లింగ వివక్ష చూపకుండా సమాజంలో సమానత్వం అందించి అన్నిరంగాల్లో బాలికలకు చేయూత అందించాలన్నారు. చిన్ననాటి నుంచే చదువుతో పాటు స్పోర్ట్స్​అండ్​ గేమ్స్​లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే భావన ఇంటి నుంచే మొదలు కావాలన్నారు.  మహిళలు సాధికారత సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అన్నారు. ఆడపిల్లల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న పలువురు బాలికలను సన్మానించారు. జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, సీఐ నారాయణ నాయక్​, షీ టీమ్ ఇన్​స్పెక్టర్​రాజేంద్రప్రసాద్​, బాలల పరిరక్షణ విభాగం ఆఫీసర్​ ఆనంద్ పాల్గొన్నారు.