- ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే ఎమ్మెల్యేల పాట్లు
- రెండు సెగ్మెంట్లలో 20 వేల మందికి ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్
- ఇప్పటికే దాదాపు 10 వేల మంది రిజిస్ట్రేషన్
- ఆర్టీఏ ఆఫీసు వద్ద ప్రతిరోజూభారీ క్యూ
- ఇప్పటివరకు 3 వేల మందికి లెర్నింగ్ లైసెన్స్ జారీ
యాదాద్రి, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం ఉన్నా.. యూత్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రూ. కోట్లు ఖర్చుపెడుతున్నారు. యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు 18 ఏండ్లు నిండిన యువతకు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా సెంటర్లు ఏర్పాటు చేయగా.. వారంలోనే 10 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 3 వేల మందికి లెర్నింగ్ లైసెన్స్ జారీ కాగా.. మరో 10 వేల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రిజిస్ట్రేషన్ కోసం తాకిడి
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఈ నెల 23న ఫ్రీ డ్రైవింగ్ లెసెన్స్ కోసం కౌంటర్ ఏర్పాటు చేశారు. ముందుగా భువనగిరి రైతుబజార్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేయించి.. ఆ తర్వాత తన క్యాంప్ ఆఫీస్‌కు మార్చారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తానని ప్రకటించి ఓ ఫంక్షన్ హాల్‌లో రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేయించారు. సెంటర్లలో వారి అనుచరులను ఉంచి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. దీనిపై భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వారంలోనే దాదాపు10 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రిజిస్టేషన్ ఫారంపై ఎమ్మెల్యేకు సంబంధించి స్టాంప్‌తో పాటు నెంబర్ వేసి పంపిస్తున్నారు. ఆ తర్వాత భువనగిరిలోని ఆర్టీఏ ఆఫీసుకు చేరుకొని ఫొటో దిగి డిజిటల్ సైన్ చేస్తున్నారు. దీంతో గడిచిన నాలుగు రోజులుగా ఆర్టీఏ ఆఫీసు వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్స్ ఇస్తుండగా.. 40 రోజుల తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ కార్డు అందించనున్నారు.
దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 4,18,076 మంది ఓటర్లున్నారు. వీరిలో2,76,299 మంది( 60 శాతం) ఓటర్లు 50 ఏండ్లలోపు వారే ఉన్నారు. ఎమ్మెల్యేలు వీరిని ఆకట్టుకునేందుకు ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ స్కీమ్‌ను ఎంచుకున్నారు. యువ ఓటర్లలో కనీసం 10 శాతం మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్ లేవు. ఇందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో 10 వేల మందికి ఇప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రెండు నియోజకవర్గాల్లో 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలంటే టూ, ఫోర్ వీలర్ లైసెన్స్‌తో పాటు ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఒక్కొక్కరికి రూ. 2 వేలకు పైగా ఖర్చు అవుతోంది. అంటే ఎన్నికల ప్రచారం జోరు అందుకోకముందే రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
గెలుపుపై భరోసా లేకనే..!
వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో ఎక్కడో అనుమానం ఉండడంతో ఎమ్మెల్యేలు ముందస్తు ఖర్చుకు సిద్దపడ్డారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఆసరా పింఛన్, రైతుబంధు మినహా ఇతర ఏ పథకాలూ కూడా పూర్తిస్థాయిలో అర్హులకు చేరడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. దళితబంధు, బీసీలకు రూ. లక్ష లాంటి స్కీమ్‌లు ప్రభుత్వం అమలు చేస్తున్నా.. నియోజకవర్గానికి పరిమిత సంఖ్యలో కేటాయిస్తోంది. ఇవి కూడా ఎమ్మెల్యేల అనుచరులు, కార్యకర్తలకే అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్షాలే కాదు సాధారణ ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. ఉద్యోగాలు, భృతి విషయంలో నిరుద్యోగులు కోపంతో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలు యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సొంతంగా ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.