ఆడవారికి ‘ఆప్ ’రూప కానుక

ఆడవారికి  ‘ఆప్ ’రూప కానుక
  • రక్షా బంధన్ రోజు ప్రకటన… భాయ్ దూజ్ నాడు అమలు
  • అన్నా, చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకైన పండుగలే ముహూర్తాలు
  • ప్రభుత్వ నిర్ణయంపై పేద,మధ్య తరగతి సంతృప్తి
  • స్కూటీలు తగ్గించి బస్సుల వైపు మళ్లుతున్న ఉద్యోగినులు

కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే పథకాలను ప్రవేశపెట్టినట్లు కనిపించినా… ఎంతోమందికి లాభం చేకూరుతోంది. అలాంటి పథకాన్నే ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల స్టంట్​గా విమర్శలు గుప్పించినా, సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదురైనా సీఎం కేజ్రీవాల్​ జంకలేదు. మహిళల భద్రత, సాధికారితలే లక్ష్యమైన ఈ స్కీమ్​కి  అన్ని వర్గాల నుంచి మంచి రియాక్షన్​ లభిస్తోంది.

నష్టాల పేరుతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్​కి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్​ వేస్తుంటే, అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వం మాత్రం ప్రజా రవాణాని బతికించుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి అన్ని వర్గాల మొప్పు పొందుతోంది. ఉత్తరాధిన ఘనంగా జరుపుకొనే భాయ్ దూజ్ (అన్నా చెల్లెళ్ల) పర్వదినం నాడు  కేజ్రీవాల్ సర్కార్ ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని పంద్రాగస్టునాడు  ప్రకటించారు. అదే రోజు రాఖీ పండుగ కావడంతో చెల్లెమ్మలకు రక్షా బంధన్ కానుకగా చెప్పారు.  ఈ స్కీమ్​కి దాదాపు రూ.2,000 కోట్లను కేటాయించింది. ఇందులో 1,000 కోట్లు మహిళ ఉచిత ప్రయాణ టికెట్లపై ఖర్చు చేయనుంది. మిగిలిన 1,000 కోట్లను స్కీమ్​ అమలుకి ఖర్చు చేస్తారు. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు ఏడాది పాటు చాలా వర్కవుట్ చేసింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్యను లెక్కించింది. ఇందుకు తగ్గట్లుగా బడ్జెట్ ప్రపోజల్స్​తో పాటూ, కోర్టుకెక్కడంలాంటి ఆటంకాలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. మెట్రోలోకూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనుకున్నా కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో బస్సుల్లోనే ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది.

పేద, మధ్య తరగతి నుంచి మంచి స్పందన

దేశ రాజధాని కావడంతో ఉద్యోగాలు, రోజు వారి కూలీపనులుకోసం కోట్లాదిమంది ఇక్కడ నివసిస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీపై ఆధారపడే సరిహద్దు రాష్ట్రాల వారి సంఖ్య అదనం. ఢిల్లీ నలువైపులా విస్తరించడంతో హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​ల్లోని బోర్డర్​లను కలుపుకొని  నేషనల్ క్యాపిటల్ రీజన్ (ఎన్సీఆర్)గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 4 కోట్ల 50 లక్షలకు పైగా ప్రజలు ఎన్సీఆర్​లో నివసిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం ఎన్సీఆర్ పరిధిలోని ఘజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్, బహదూర్ ఘర్, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్  వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే, లక్షలాది మంది మహిళలు ప్రైవేటు ఉద్యోగాలు, కూలి పనులు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈ పథకం భరోసా కల్పిస్తోంది. నెల మొత్తం కష్టపడినా 10,‌‌000 రూపాయలైనా సంపాదించలేని కుటుంబాలకు ఈ ఉచిత బస్సు పథకం ఆర్థికంగా సపోర్ట్ ఇస్తుంది. అందుకే, పేద, మధ్య తరగతి ప్రజలు ఈ కొత్త స్కీమ్​కి జై కొడుతున్నారు. సీఎం కేజ్రీవాల్ తానే స్వయంగా బస్సులో ప్రయాణం చేసి మహిళ నుంచి ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు, ఒంటరి మహిళలు, సాధారణ కుటుంబాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, లక్షలాది కుటుంబాల్లో ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.

ప్రైవేటు వాహనాలకు చెక్….

ఉచిత బస్సు ప్రయాణ పథకం వచ్చాక స్కూటీ, క్యాబ్​లను ఉపయోగించే మహిళలు తగ్గుతున్నారు. బస్సుల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం  మహిళలు నడిపే వాహనాల సంఖ్య 2,‌‌000 వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా మరో 10 వేల మంది మార్షల్స్

ఢిల్లీలో నిర్భయ ఘటన మొత్తం ఇంటర్నేషనల్​గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే, చాలామంది ఆడ పిల్లల్ని, భార్యల్ని బయటకు పంపించాలంటే జంకే పరిస్థితి. కేజ్రీవాల్ సర్కార్ దీనినికూడా దృష్టిలో ఉంచుకుని మహిళ సాధికారతతో పాటూ, భద్రతకు పెద్ద పీట వేసింది. ఇప్పటికే మహిళల భద్రత కోసం హోం గార్డులను వినియోగిస్తున్న రాష్ట్ర సర్కార్, కొత్తగా మార్షల్స్ (సివిల్ డిఫెన్స్ ఫోర్స్​)ని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,000 మందికి అదనంగా మరో 10,000 మంది మార్షల్స్​ని నియమించనున్నట్లు కేజ్రీవాల్​ ప్రకటించారు.

బకాయిల విడుదలతోనే సాధ్యమైంది

తెలంగాణలో ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోవడానికి, ఢిల్లీలో ఉచిత ప్రయాణ పథకం అమలుకు ప్రభుత్వాల ఆలోచనలే కారణమంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టినాగానీ, డీటీసీకి నిధుల విషయంలో స్పష్టత ఉందంటున్నారు. అందుకే, డిటీసీ బస్సులే కాకుండా, క్లస్టర్​లోని ఆపరేటర్లుకూడా మద్దతు తెలుపుతున్నారని చెబుతున్నారు.

అన్ని మార్గాల్లోనూ బస్సులు

ఉచిత ప్రయాణానికి ముందు కొన్ని మార్గాల్లో మాత్రమే బస్సులు నడిచేవి. ఇప్పుడు అన్ని మార్గాల్లోనూ తిరుగుతున్నాయి. ఢిల్లీ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) 3,781 బస్సులు, క్లస్టర్స్ (ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు) 1, 808 బస్సులు, మొత్తంగా 5,589 బస్సులు నడుపుతున్నాయి. నాన్ ఏసి టికెట్ మినిమమ్​ 10 రూపాయలు, చివరి స్టాప్​కి 15 రూపాయలు.  ఏసీ టికెట్ ధర 15 నుంచి 25 రూపాయలుగా ఉన్నాయి. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బస్సులో ప్రయాణించే ప్రతి మహిళకు పింక్ టికెట్ ఇస్తున్నాం. ఎన్ని బస్సులు మారితే అన్నిసార్లు టికెట్లు తీసుకోవాలి. ఈ పింక్​ టికెట్​ ఉన్నవాళ్ల దగ్గర చార్జీలు వసూలు చేయడం లేదు. ప్రతి రోజు పింక్ టికెట్ల డేటాని ప్రభుత్వానికిస్తున్నాం. దీని ఆధారంగా టికెట్​కు 10 రూపాయలు లెక్కన చెల్లిస్తుంది.  ‘ఎప్పుడు మహిళ ముందడుగు వేస్తుందో, అప్పుడు దేశం ముందుకు సాగుతుంది’ అనే మెసేజ్​తో టికెట్లను ప్రింట్​ చేశాం.

ఆర్.ఎస్.మిన్హాస్, డిటిసి సిజిఎం

మహిళల భద్రత కోసం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఢిల్లీలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే. ఉచిత బస్సు ప్రయాణం, బస్సుల్లో మార్షల్స్ ఏర్పాటు మాలో ధైర్యాన్ని నింపింది. – మమత,ప్రైవేటు ఉద్యోగి

నాకు గతంలో ఒక్కటే బస్సు. అదెప్పుడు వస్తోందో తెలీదు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి చేరడానికి చాలా సమయం పట్టేది.   ఢిల్లీ సర్కార్ కొత్త స్కీమ్​తో సంతోషంగా ఉంది.– సుజాత,ప్రభుత్వ ఉద్యోగి

మహిళలతో పాటూ, ఈ స్కీమ్​ని పేదలకుకూడా అందిస్తే బాగుండేది. రోజుకు రెండు, మూడు వందలు మాత్రమే సంపాదించే కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుంది.– అమితా,గృహిణి

ఇదంతా ఎన్నికల స్టంట్.

200 యూనిట్ల లోపు ఉచిత  విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఎన్నికల కోసమే. త్వరలో రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉచిత తాయిలాలను కేజ్రీవాల్​ ఇస్తున్నారు. ఏదేమైనా, ఢిల్లీలో మహిళల భద్రత చాలా ముఖ్య అంశమే.– కోయల్, ఢిల్లీ వాసి