తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. బుధవారం (జనవరి 8) తిరుపతిలో జరిగిన తొక్కి సలాట ఘటనపై చర్చించేందుకు టీటీడీ పాలక వర్గం శుక్రవారం (జనవరి 10) అత్యవసర భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ పాలక వర్గం చర్చించింది.
ఈ భేటీ అనంతరం టీటీడీ చైర్మన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి జరిగిన సంఘటన అందరినీ కలచి వేసింది అన్నారు. ఈ దురదృష్ట సంఘటనలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకి 5 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
Also Read :- పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
అదేవిధంగా మృతుల పిల్లలకు ఉచిత విద్యను కూడా టీటీడీ విద్యాసంస్థల్లో ఇవ్వడానికి మా బోర్డు నిర్ణయించిందని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా చెరో 10 లక్షలు, ఎమ్మెస్ రాజు 3 లక్షల రూపాయలు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.