హైదరాబాద్: గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం భావించి ఉత్సవ కమిటీలవిజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం (సెప్టెంబర్ 7) ఖైరతాబాద్ విశిష్ట గణపతిని సందర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు.
ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యుడు శ్రీ దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.