యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం

యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం
  • రూ.లక్ష ప్యాకేజీతో సర్కారు కొత్త స్కీమ్
  • తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయం
  • గోల్డెన్​ అవర్​లో ట్రీట్​మెంట్​ అందించడమే లక్ష్యం
  • అధ్యయనం కోసం తమిళనాడుకు ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు తమిళనాడు తరహాలో ట్రామాకేర్  వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు పనులు స్పీడప్  చేసింది. తమిళనాడులో అమలవుతున్న వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ ఆఫీసర్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. వైద్య విధాన పరిషత్  కమిషనర్  అజయ్‌‌ కుమార్, మెడికల్  కార్పొరేషన్  ఎండీ సహదేవ్‌‌  తదితరుల బృందం గురువారం తమిళనాడు వెళ్లింది. 

అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖాన్లతో పాటు, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లోనూ బాధితులకు చికిత్స అందేలా తమిళనాడు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొచ్చింది. యాక్సిడెంట్లు, గుండెపోట్లు, సూసైడ్స్  తదితర ఎమర్జెన్సీ కండిషన్​లో ఉన్నవారికి ప్రైవేటు హాస్పిటల్స్​లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామాకేర్  ప్యాకేజీని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామాకేర్​లో అడ్మిట్ అయ్యే పేషెంట్‌‌కు రూ.లక్ష వరకూ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. 

గోల్డెన్​అవర్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్  అందించి బాధితుల ప్రాణాలను కాపాడడమే ఈ స్కీమ్  ఉద్దేశం. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తమిళనాడులో ఇలా..

రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీల్లో పేషెంట్లకు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అందేలా తమిళనాడు ట్రామా కేర్ సిస్టమ్ ఉంది. యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (108 తరహా)కు ఫోన్  వచ్చిన వెంటనే దగ్గర్లోని ట్రామాకేర్  సెంటర్లకు కూడా సమాచారం వెళ్లేలా అక్కడ ఒక చైన్  సిస్టమ్  ఉంది. జీపీఎస్  ఆధారంగా యాక్సిడెంట్  లొకే షన్‌‌‌‌కు దగ్గరలో ఉన్న అంబులెన్స్‌‌‌‌ను స్పాట్‌‌‌‌కు పంపిస్తా రు. 

లొకేషన్‌‌‌‌కు చేరుకున్న వెంటనే బాధితుడికి అయిన గాయాల వివరాలను ట్రామాకేర్ కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు అంబులెన్స్​లోని హెల్త్ స్టాఫ్ చేరవేస్తారు. బాధితుడికి ట్రీట్మెంట్ అందించేందుకు ఏయే స్పెషాలిటీ డాక్టర్లు అవసరమో చెప్తారు. ఈ వివరాలను బట్టి దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్‌‌‌‌కు(ప్రభుత్వ/ప్రైవేటు) పేషెంట్‌‌‌‌ను తరలించాలో అంబులెన్స్  డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్  సూచిస్తుంది. 

అలాగే, ఆ హాస్పిటల్‌‌‌‌కు కూడా ముందే సమాచారం ఇస్తారు. దీంతో దవాఖానకు అంబులెన్స్ చేరుకునేలోగా అక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉంటారు. ట్రీట్​మెంట్​కు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వమే ఆ హాస్పిటల్‌‌‌‌కు చెల్లి స్తుంది. పేషెంట్ స్టేబుల్ అయ్యాక  అక్కడే చికిత్స కొనసాగించొచ్చు. లేదా మరేదైనా హాస్పిటల్‌‌‌‌కు పేషెంట్‌‌‌‌ను తరలించొచ్చు.

ప్రైవేట్ హాస్పిటల్స్ ఒప్పుకుంటయా?

ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్లను ప్రైవేటు హాస్పిటళ్లు పెద్ద ఆదాయ మార్గంగా చూస్తాయి. అందినకాడికి దోచుకోవడానికే ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెచ్చే కొత్త స్కీమ్‌‌‌‌కు హాస్పిటళ్లు అంత సు లభంగా ఒప్పుకోవని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్‌‌‌‌కు డబ్బులతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ అందించాలన్న నిబంధనలు పెడుతూ రాజస్థాన్  ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ యాక్ట్ ను అక్కడి డాక్ట ర్లు, ప్రైవేటు హాస్పిటళ్ల ఓనర్లు వ్యతిరేకించారు. వారికి మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే ట్రామాకేర్ ప్యాకేజీని ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ అంగీకరిస్తాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.