ఉమ్మడి వరంగల్ జిల్లాలో ..సన్న బియ్యం పంపిణీ రెడీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ..సన్న బియ్యం పంపిణీ రెడీ

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ఏప్రిల్​1 నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు  చేశారు. గతంలో ప్రభుత్వం రేషన్​ షాపుల ద్వారా దొడ్డుబియ్యం సరఫరా చేయడంతో అనేక మంది దొడ్డు బియ్యాన్ని తినలేక ఇతరులకు విక్రయించేవారు. దళారులు రేషన్​ బియ్యాన్ని కిలోకు రూ.4 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకొనేవారు. పలు చోట్ల రేషన్​డీలర్లు కొంతమంది పరోక్షంగా బియ్యం అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వం చెక్​ పెట్టేందుకు సన్నబియ్యం సరఫరా చేయనున్నది. 

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని జనగామ335 దుకాణాలు ఉండగా, మహబూబాబాద్​558, ములుగు222, వరంగల్​ 509, హనుమకొండ 427, జయశంకర్​ భూపాలపల్లి 277 రేషన్​ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కాగా, మహబూబాబాద్​ జిల్లాలో రేషన్​ దుకాణాలు 558 పరిధిలో ఆహారభద్రత కార్డులు  2,24,216, అంత్యోదయ కార్డులు 16,794, అన్నపూర్ణ కార్డులు 02, మొత్తంగా కార్డులు 2,41,012 ఉండగా, రేషన్​యూనిట్లు 7,03,550 ఉన్నాయి. ఆయా కార్డుల ద్వారా సన్న బియ్యం సరఫరాకు చేసేందుకు 4,518 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 

ఏప్రిల్​1 నుంచి సన్నబియ్యం పంపిణీ..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్​ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ కోసం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్​ డీలర్లకు నేరుగా సన్నబియ్యాన్ని పంపించాం. రేషన్​ డీలర్ల వద్ద కార్డుల సంఖ్యకు అనుగుణంగా బియ్యాన్ని అందుబాటులో ఉంచాం. నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ సరఫరాతో ప్రజలు ఇతరులకు విక్రయించకుండా వారే వినియోగించుకునే అవకాశం ఉంది. - జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, మహబూబాబాద్​